TRS – BJP : బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్.. ఎంజాయ్ చేస్తున్న కాంగ్రెస్.!
TRS – BJP : తెలంగాణలో చిత్రమైన రాజకీయం నడుస్తోంది. సంఖ్యాబలాన్ని బట్టి చూసుకుంటే, తెలంగాణ రాష్ట్ర సమితికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గట్టి పోటీ ఇవ్వాలి. కానీ, అనూహ్యంగా బీజేపీ పుంజుకుంది. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలే. కాంగ్రెస్ నుంచి పలువురు ముఖ్య నేతలు, బీజేపీలోకి దూకెయ్యడంతో తెలంగాణలో బీజేపీ బలోపేతమయ్యింది. కాంగ్రెస్ నుంచి అటు గులాబీ పార్టీలోకీ, ఇటు కమలం పార్టీలోకీ నేతలు వలస వెళ్ళడంతో, కాంగ్రెస్ తెలంగాణలో బలహీనమైపోయినమాట వాస్తవం.
చిత్రమేంటంటే, పుంజుకునే అవకాశం వున్నాగానీ, ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించకపోవడం. బీజేపీ నుంచి సరైన నాయకుల్ని ఒక్కర్నీ లాక్కోలేకపోతున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి మాత్రం నేతల్ని లాగేస్తూనే వుంది. అంటే, ఇక్కడ బీజేపీ – టీఆర్ఎస్ రాజకీయమేంటో సుస్పష్టం. కానీ, ఈ రాజకీయాన్ని కాంగ్రెస్ అర్థం చేసుకోలేకపోతోంది. బీజేపీ, టీఆర్ఎస్ నిజంగానే కొట్టుకుంటున్నాయనుకుని, ఆ గేమ్‌ని కాంగ్రెస్ పార్టీ ఎంజాయ్ చేస్తోంది.

TRS Vs BJP, Congress Enjoying the game
ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో నానాటికీ బలహీనపడుతూ వస్తోంది.దీనంతటికీ కారణం తెలంగాణ పీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి.. అంటూ కొందరు కాంగ్రెస్ నేతలే ఆరోపిస్తున్నారు. ఆయన్ని బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల కోవర్టుగా అభివర్ణిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి రేవంత్ రెడ్డి పరిస్థితి ఎలా వుంటుందోగానీ, ఈలోగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తెలంగాణ నుంచి తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి రావొచ్చన్నది కాంగ్రెస్ పార్టీలో రేవంత్ వ్యతిరేకుల వాదనగా కనిపిస్తోంది.