Cat : పిల్లి కరిచి ఇద్దరు మహిళలు మృతి.. అదే పిల్లి కుక్కకాటుకు బలి.. అసలు ఏం జరిగిందంటే..?
Cat : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కృష్ణా జిల్లా మొవ్వ మండలం వేములమడలో ఓ పిల్లి కరిచి ఇద్దరు మహిళలు మృతి చెందారు. పాము కాటుకు, కొన్ని సార్లు కుక్క కాటుకు గురై మనుషులు చనిపోతుండటం చూశాం కానీ పిల్లి కరిచి చినిపోవడం ఇదే ప్రథమం. అయితే ఈ మహిళలను కరిచి చంపిన పిల్లి కూడా ఓ కుక్క కాటుకు బలైపోయింది. ఆ తర్వాత ఆ కుక్కు కూడా చనిపోయింది. అసలిదంతా ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.వేములమడ దళిత వాడలోని విశ్రాంత కండక్టర్ సాలి భాగ్యారావు భార్య కమలను, ప్రైవేటు వైద్యుడు బొడ్డు బాబూరావు భార్య నాగమణిని రెండు నెలల క్రితం ఓ పిల్లి కరిచింది. వైద్యుల సలహా మేరకు వారిద్దరు టీటీ ఇంజక్షన్లు తీసుకున్నారు.
గాయాలు తగ్గడానికి మందులు కూడా వాడారు. కొన్ని రోజుల్లోనే ఆ గాయాలు కూడా తగ్గిపోయాయి. అయితే నాలుగు రోజుల క్రితం మళ్లీ వారిద్దరికీ ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో భయపడిపోయిన ఆ మహిళలు అద్దరూ ఆస్పత్రులకు పరుగులు పెట్టారు. కమల మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి.. నాగ మణి శుక్రవారం విజయవాడలోని కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. అయితే నాగమణి శనివారం తెల్లవారుజామున మృతి చెందగా… కమల శనివారం ఉదయం10 గంటలకు ప్రాణాలు విడిచింది. అయితే వీరిద్దరి మృతికి రేబిస్ వ్యాధి సోకడమే కారణం అని వైద్యులు తెలిపారు. పిల్లి కరవడం వల్లే వీరిద్దరికి రేబిస్ వ్యాధి వచ్చిందని వివరించారు.
అంతే కాకుండా వీరిద్దరిని కరిచిన పిల్లి కూడా కుక్క కాటుకు గురై మరణించిదని గ్రామస్థులు, మృతుల కుటుంబ సభ్యులు తెలిపారు. అలాగే పిల్లిని కరిచిన కుక్క కూడా కొన్ని రోజుల్లోనే చనిపోయిందని వివరించారు. అయితే మహిళలకు సకాలంలో వైద్య సేవలు అందక పోవడం వల్లే వారు చనిపోయారని స్థానిక ఆరోగ్య కేంద్రం అధికారి శొంఠి శివరామకృష్ణారావు తెలిపారు. అంతే కాకుండా పిల్లి, కుక్క, ఎలుక, పాము వంటివి కరిస్తే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాల్లో తగిన వైద్యం చేయించుకోవాలని సూచించారు.