Venky 77 | వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబోలో ‘వెంకీ 77’ స్టార్ట్ .. 20 నెలల తర్వాత మళ్లీ ..
Venky 77 | విక్టరీ వెంకటేష్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ నూతన చిత్రం సెట్స్ పైకి వెళ్లింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తోన్న ఈ సినిమాను Venky77 అనే వర్కింగ్ టైటిల్‌తో అధికారికంగా ప్రకటించారు. సూపర్ హిట్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా తర్వాత వెంకటేష్ చేస్తున్న చిత్రం కావడం, మరోవైపు త్రివిక్రమ్ 20 నెలల విరామం తర్వాత మళ్లీ డైరెక్షన్‌కి వచ్చారు కాబట్టి ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
#image_title
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అధికారికంగా వెల్లడించారు. “20 నెలల తర్వాత త్రివిక్రమ్ మళ్లీ కెమెరా వెనక్కి వచ్చారు. అందరికీ ఇష్టమైన వెంకటేష్‌గారితో కలసి ‘ది ఓజీస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్’ మళ్లీ మ్యాజిక్ రీక్రియేట్ చేయడానికి సిద్ధమయ్యారు” అంటూ ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. సెట్స్‌లో వెంకటేష్ మరియు త్రివిక్రమ్ కలిసి ఉన్న ఫొటోను కూడా షేర్ చేశారు.
ఇదివరకు త్రివిక్రమ్ కథ, మాటలు అందించిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి సినిమాల్లో వెంకటేష్ నటించారు. ఇవి అప్పట్లో బాక్సాఫీస్ హిట్స్‌గానే కాకుండా ఇప్పటికీ టీవీల్లో టాప్ రేటింగ్స్ సాధిస్తుండటం విశేషం. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, వెంకటేష్ కామెడీ టైమింగ్ ఈ సినిమాల్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ కాంబో డైరెక్ట్‌గా సినిమా చేయాలన్న అభిమానుల కోరిక ఎంతో కాలం తర్వాత నెరవేరుతోంది.