Ganesh Chaturthi : ఏకదంతుడిగా గణేశుడు.. విరిగిన దంతం వెనుక ఉన్న పురాణ కథలు తెలుసా?
Ganesh Chaturthi : వినాయక చవితి సమీపిస్తుండడంతో గణేశుడి వివిధ రూపాలు, నామాలు గురించి చర్చ మొదలైంది. “విఘ్నేశ్వరుడు”, “గజాననుడు”, “లంబోదరుడు”, “బాలచంద్ర”, “హేరంబ” వంటి అనేక పేర్లతో పిలవబడుతుంటాడు. “ఏకదంతుడు” అనే పేరు ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందడంతో గణేశుడిని ఎందుకు ‘ఏకదంతుడు’గా పిలుస్తారు? అతనికి ఒకే ఒక్క దంతం ఎందుకు మిగిలింది? ఈ ప్రశ్నలకు పురాణాల్లో మూడు ప్రముఖ కథలు వినిపిస్తాయి.
#image_title
మూడు కథలు..
ఒక కథ ప్రకారం పరశురాముడు కైలాసానికి వచ్చి శివుడిని దర్శించాలనుకున్నాడు. కానీ గణేశుడు తన విధి నిబద్ధతతో అతన్ని ఆపాడు. ఆ సమయంలో ఓ దంతం విరిగిందని అంటారు. రెండోది వేదవ్యాసుడు మహాభారత కథ చెబుతుండగా, గణేశుడు అదే సమయంలో రచన చేస్తూ ఉండేవాడు. ఒక షరతు ప్రకారం రచన మధ్యలో ఆగకూడదని వేదవ్యాసుడు చెప్పాడు. ఆ సమయంలో గణేశుడి కలం విరిగిపోయింది. అప్పుడతను తన దంతాన్ని విరిచి , దానిని కలంగా మార్చుకుని రచన కొనసాగించాడు.
మరో ఆసక్తికర కథ ప్రకారం, గజముఖాసురుడు అనే రాక్షసుడిని ఏ ఆయుధంతోనూ చంపలేమని తెలిసిన గణేశుడు, తన దంతాన్ని ఆయుధంగా మారుస్తూ , గజముఖాసురుడిని సంహరించాడు. దీనివల్ల గణేశుడి దంతం విరగడం ఓ విజయ గాధగా మారింది. ఈ మూడు కథలవల్ల గణేశుడికి “ఏకదంతుడు” అనే నామం కలిగిందని హిందూ మత విశ్వాసం చెబుతోంది. “ఏకదంతం” అంటే “ఒక పన్ను గలవాడు” అనే అర్థం. గణేశుడి విగ్రహాల్లో ఒక దంతం విరిగినట్టు ఉండడం కూడా దీనికే సూచన.