Viral News : తండ్రి మరణించిన ఆసుపత్రిలో కొడుకు జననం..హృదయాన్ని మెలిపెట్టే విషాదం
ప్రధానాంశాలు:
Viral News : తండ్రి మరణించిన ఆసుపత్రిలో కొడుకు జననం..హృదయాన్ని మెలిపెట్టే విషాదం
Viral News : కొన్ని విషాదాలు తీరని దుఃఖాన్ని మిగులుస్తాయి. హృదయాన్ని మెలిపెట్టే విషాదాలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం.తాజాగా జరిగిన ఘటన ప్రతి ఒక్కరి కంట కన్నీరు కార్చేలా చేస్తుంది.ఆ దంపతులకు వివాహమై 14 నెలలు అవుతోంది. భార్య నెలలు నిండిన గర్భిణి. భర్త బుధవారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. భార్య తెల్లవారుజామున 4 గంటలకు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కొడుకును చూడకుండా తండ్రి అనంతలోకాలకు చేరిన భర్త అంత్యక్రియల్లో పాల్గొనలేని దుస్థితి ఆమెది. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం తుమ్మలపల్లికి చెందిన శివ అనే వ్యక్తి మంగళవారం సాయంత్రం రాజోలి నుంచి సొంత గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు.
Viral News హృదయ విదారకమైన ఘటన..
మార్గమధ్యలో ఒక్కసారిగా కుక్క అడ్డు రావడంతో అదుపుతప్పి అతని వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన శివను హుటాహుటిన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు శివ భార్య లక్ష్మీ గర్భవతిగా ఉంది. కొద్ది రోజుల క్రితం లక్ష్మీ ప్రసవం కోసం పుట్టింటికి వెళ్ళింది. ఆమెకు నొప్పులు రావడంతో పుట్టింటివారు నంద్యాల జిల్లా బలపాలపల్లి నుంచి దగ్గరలో ఉన్న బేతంచెర్ల ఆసుపత్రికి తీసుకువెళ్లారు. బీపీ అధికంగా ఉండడంతో ఆమెను కర్నూలు జిల్లాలోని ఆసుపత్రికి తరలించాల్సిందిగా వైద్యులు సూచించారు. ప్రమాదానికి గురైన శివ ప్రాణపాయ స్థితిలో, ప్రసూతి కోసం వచ్చిన లక్ష్మి ఇద్దరు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు.
అయితే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శివ కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతూ ప్రాణాలు విడిచాడు. మరోవైపు ప్రసవం కోసం వచ్చిన లక్ష్మికి పండంటి మగ శిశువు జన్మించాడు. శివ మరణించిన ఓ గంట సమయం తర్వాత అతనికి కుమారుడు పుట్టాడు. కానీ తనయుడిని చూసేందుకు ఆయన ప్రాణాలతో లేరు. ఓవైపు తండ్రి మరణం మరోవైపు కుమారుని జననం, ఈ విషయాన్ని ఆ తల్లి లక్ష్మీకి ఎలా చెప్పాలో తెలియక కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దని లక్ష్మీ కుటుంబ సభ్యుల రోదన అక్కడ ఉన్న వారందరీ గుండెలను పిండేసింది. లోబీపీ కూడా ఉండడంతో వైద్యుల సూచన మేరకు ఆమెకు భర్త మృతి చెందిన విషయాన్ని కుటుంబీకులు చెప్పలేదు. తర్వాత చివరి చూపుకోసం చెప్పడంతో ఆమె రోదన కలిచివేసింది. విధి ఆడిన నాటకంలో ఆమె భర్త అంత్యక్రియలకు సైతం వెళ్లలేకపోయింది.