Virat Kohli : ఆరేళ్ల తర్వాత ఆ పని చేసిన విరాట్ కోహ్లీ.. మురిసిపోయిన అభిమానులు
Virat Kohli : టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవల తెగ వార్తలలో నిలుస్తున్నాడు. అందుకు కారణం ఆయన ఫామ్ లేమి సమస్య. మూడేళ్లుగా ఒక్క సెంచరీ చేయలేకపోయిన కోహ్లీ నిత్యం హాట్ టాపిక్‌గా మారుతూనే ఉన్నాడు. అయితే నెల రోజుల సుదీర్ఘ విరామం తర్వాత ఆసియాకప్ 2022తో మైదానంలోకి రీఎంట్రీ ఇచ్చిన విరాట్ బ్యాట్‌తో పాటు బంతితోను అదరగొట్టాడు. పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కీలక 35 పరుగులు చేసిన విరాట్.. హాంగ్ కాంగ్‌తో అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. సూర్యకుమార్ యాదవ్(26 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 68 నాటౌట్)తో కలిసి విరాట్ కోహ్లీ(44 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 59 నాటౌట్) మూడో వికెట్‌కు 98 పరుగులు జోడించాడు.
Virat Kohli : అద్భుతమైన బౌలింగ్..
ఇక మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 17వ ఓవర్ కోసం విరాట్ కోహ్లీ చేతికి కెప్టెన్ రోహిత్ శర్మ బంతినిచ్చాడు. దాంతో.. విరాట్ కోహ్లీ కూడా ఆ ఛాన్స్‌ని చక్కగా వినియోగించుకుని గంటకి 107-110 కిమీ వేగంతో బంతులు వేశాడు. ఆరేళ్ల తర్వాత బౌలింగ్ చేసినా… కోహ్లీ కనీసం ఒక్క బౌండరీ కూడా హాంకాంగ్ బ్యాటర్లని ఆ ఓవర్‌లో కొట్టనివ్వలేదు. అర్షదీప్, ఆవేశ్ ఖాన్ దారుణంగా విఫలమైన వేళ విరాట్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం అభిమానులను ఆకట్టుకుంది. ఇక అప్పుడెప్పుడో ఆరేళ్ల క్రితం 2016 టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో బౌలింగ్ చేసిన విరాట్.. తన ఫస్ట్ ఓవర్‌లోనే వికెట్ తీసాడు. ఆ మ్యాచ్‌లో విరాట్ అద్భుతంగా బ్యాటింగ్ చేసినప్పటికీ.. విండీస్ వీరులు విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత్‌ను ఓడించి ఫైనల్‌కు చేరారు.
సుమారు ఆరేళ్ల తర్వాత మళ్లీ విరాట్ బౌలింగ్ చేయడం అభిమానులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఓవర్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్‌గా మారాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 192 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన హాంగ్ కాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టులో బాబర్ హయత్(35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41), కించిత్ షా(28 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 30) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, రవీంద్ర జడేజా, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ తీసారు.