మృతదేహాన్ని దహనం చేస్తే కరోనా అంతమవుతుంది.. వ్యాప్తి చెందదు: వైద్య నిపుణులు
కరోనా నేపథ్యంలో ప్రజలకు అనేక అనుమానాలు నెలకొంటున్నాయి. ఫలానా పని చేస్తే కరోనా వస్తుందని అనేక అపోహలు పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే మృతదేహాలను దహనం చేశాక కూడా కరోనా వ్యాప్తి చెందుతుందని అనుకుంటున్నారు. కానీ ఇందులో ఎంత మాత్రం నిజం లేదని, అదంతా అపోహేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.
వ్యక్తి కరోనాతో చనిపోయాక మృతదేహంలో 72 గంటల వరకు కరోనా వైరస్ బతికే ఉంటుందని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (ఐజీఎంసీ) ఫోరెన్సిక్ మెడిసిన్ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ పీయూష్ కపిల వెల్లడించారు. కరోనాతో మృతి చెందిన తరువాత మృతదేహాలను హాస్పిటళ్లలో సురక్షితంగా ప్యాక్ చేస్తారని, అందువల్ల మృతదేహాల నుంచి కోవిడ్ వ్యాప్తి చెందదని అన్నారు.
ఇక కరోనా మృతదేహాలను దహనం చేశాక కరోనా నశిస్తుందని, అందువల్ల కోవిడ్ వ్యాప్తి చెందదని అన్నారు. విద్యుత్ దహన వాటికల్లో అయితే కొన్ని వేల డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుందని, అలాంటి అత్యధిక ఉష్ణోగ్రతలలో కరోనా బతికే అవకాశం లేదని, 70 నుంచి 75 డిగ్రీల ఉష్ణోగ్రతలో కరోనా నశిస్తుందని అన్నారు. అందువల్ల మృతదేహాలను దహనం చేశాక కోవిడ్ వ్యాప్తి చెందుతుందని అపోహలకు గురి కావద్దని, అలా జరిగే అవకాశమే లేదని, ఇందులో భయాందోళనలకు గురి కావల్సిన అవసరం లేదని అన్నారు.