Vizag Agency : విశాఖ ఏజెన్సీలోని 25 గ్రామాల ప్రజలు ప్రతి వారం ఆ చెట్టు దగ్గరికి వెళ్లాల్సిందే.. ఆ చెట్టు దగ్గర ఏముంది? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vizag Agency : విశాఖ ఏజెన్సీలోని 25 గ్రామాల ప్రజలు ప్రతి వారం ఆ చెట్టు దగ్గరికి వెళ్లాల్సిందే.. ఆ చెట్టు దగ్గర ఏముంది?

 Authored By jagadesh | The Telugu News | Updated on :20 July 2021,8:01 pm

Vizag Agency : అది విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం. ఏజెన్సీ ప్రాంతం అంటేనే తెలుసు కదా ఎలా ఉంటుందో.. కొండలు, గుట్టలు.. అంతా చుట్టూ అడవే ఉంటుంది. జిల్లాలోని అనంతగిరి మండలంలో ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో సుమారు 25 గ్రామాల ప్రజల బాధలు అయితే వర్ణణాతీతం. ఎందుకంటే.. వాళ్లు వారం వారం ఖచ్చితంగా ఓ చెట్టు దగ్గరికి వెళ్లాల్సిందే. ఆ చెట్టు దగ్గరికి జనాలు… గుంపులు గుంపులుగా వెళ్తుంటారు. ఇంతకీ ఆ చెట్టు దగ్గర ఏముంది? అంటారా? అక్కడ మాయా లేదు.. మంత్రం లేదు.. లేదా.. అక్కడేమీ దేవుడు వెలవలేదు. వాళ్లు ఆ చెట్టు దగ్గరికి వెళ్లేది సెల్ ఫోన్ సిగ్నల్ కోసం.

vizag agency people struggle for phone signal in velagapadu

vizag agency people struggle for phone signal in velagapadu

అవును.. ఆ ఏజెన్సీలోని 25 గ్రామాల పరిధిలో ఎక్కడా సిగ్నల్ రాదు. ఫోన్లు ఉన్నా వేస్ట్. పనిచేయవు. ఒక్క ఫోన్ రాదు. ఫోన్ లో సిగ్నల్ రావాలంటే.. కనీసం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ చెట్టు దగ్గరికి పోవాల్సిందే. అక్కడికి వెళ్తేనే ఫోన్ లో సిగ్నల్ వస్తుంది. అందుకే.. అక్కడి వారు.. ఎవరితోనైనా ఫోన్ మాట్లాడాలన్నా.. ఏదైనా సమాచారం తెలుసుకోవాలన్నా కూడా ఆ చెట్టు దగ్గరికి వెళ్తుంటారు.

Vizag Agency : ప్రభుత్వ అధికారులు కూడా ఆ చెట్టు కిందే మకాం

ప్రభుత్వ అధికారులు.. ఆయా ఏజెన్సీ గ్రామాలకు ఏవైనా ప్రభుత్వ పథకాలు అందించాలన్నా కూడా ఆ చెట్టు కిందికి వెళ్లాల్సిందే. ఎందుకంటే.. ప్రభుత్వ పథకాలను ఆధార్ తో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని కోసం.. బ్యాంక్ అకౌంట్ వివరాలు.. ఇంకా వేలిముద్రలను బయోమెట్రిక్ విధానంలో తీసుకుంటారు. అవన్నీ పనిచేయాలంటే.. ఖచ్చితంగా ఇంటర్నెట్ ఉండాలి. సెల్ ఫోన్ లో సిగ్నల్ కూడా ఉండాలి. లేకపోతే కనీసం ఓటీపీ కూడా రాదు. అందుకే.. లబ్ధిదారులు ఆ చెట్టు దగ్గరికి వెళ్లి అధికారులను వేడుకోవాల్సిన పరిస్థితి నెలకొందని అక్కడి ప్రాంత ప్రజలు చెబుతున్నారు.

ఎక్కడ సిగ్నల్ ఉంటే అక్కడికి రావాలి. లేకపోతే మీకు ప్రభుత్వ పథకాలు వర్తించవు. వాటి ద్వారా వచ్చే డబ్బులు కూడా రావు.. అంటూ ఆయా గ్రామాల ప్రజలకు ప్రభుత్వ వాలంటీర్లు, అధికారులు చెబుతున్నారట. మీకు ప్రభుత్వ పథకం వర్తించాలంటే.. అక్కడ సిగ్నల్ ఉన్న ప్రాంతానికి రండి. అప్పుడు పథకం కోసం అప్లయి చేస్తామని ఖరాఖండిగా అధికారులు చెప్పేస్తున్నారట. దీంతో.. 15 కిలోమీటర్ల మేర ప్రయాణించి మరీ.. ఆ చెట్టు దగ్గరికి చేరుకొని బయోమెట్రిక్, ఇతర వివరాలను అందించాల్సి వస్తోంది. ఇంకో విషయం ఏంటంటే.. ఆ చెట్టు దగ్గరికి చేరుకోవాలంటే కొన్ని గ్రామాల ప్రజలు.. కొండలు, గుట్టలు దాటాల్సి వస్తోంది. సరైన రోడ్డు కూడా లేదు. దీంతో సిగ్నల్ కోసం, ప్రభుత్వ పథకాలకు బయోమెట్రిక్ ఇవ్వడం కోసం ఆ చెట్టు దగ్గరికి వెళ్లడం పెద్ద సాహసమే అని అంటున్నారు స్థానికులు.

ఇక్కడ అసలు చాలెంజింగ్ ఏంటంటే.. వృద్ధులు, వికలాంగులు.. నడవలేని వాళ్లు అక్కడికి రావడం చాలా కష్టం. వాళ్ల సొంత పనుల కోసం కూడా అంత దూరం రాలేని పరిస్థితి ఏర్పడింది. కొందరైతే.. అంత దూరం వెళ్లలేక.. ప్రభుత్వ పథకాలను వదిలేసుకుంటున్నారు.

ఏజెన్సీ ప్రాంతంలో సిగ్నల్ రాకపోవడానికి ప్రధాన కారణం.. అక్కడ ఉండే కొండలు, గుట్టలు. అవి సిగ్నల్ రాకుండా అడ్డుకుంటున్నాయి. అలాగే.. ఎక్కువ ప్రాంతాల్లో సెల్ టవర్స్ లేవు. ఉన్న చోట కూడా సరిగ్గా సిగ్నల్ రావడం లేదు. దీంతో ప్రభుత్వం స్పందించి.. ఎలాగైనా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న సిగ్నల్ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

(Image and Content Courtesy : BBC Telugu)

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది