Thammineni Seetharam : ఇక స్పీకర్ వంతు.. నిమ్మగడ్డకు ఊహించని షాక్ ఇచ్చిన స్పీకర్ తమ్మినేని?
ఏంటో.. అసలు ఏపీలో ఏం జరుగుతున్నదో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఓవైపు పంచాయతీ ఎన్నికలు.. మరోవైపు ఎన్నికల కమిషన్, ఏపీ ప్రభుత్వం మధ్య జరుగుతున్న గొడవలు.. రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా లేవు. ఇప్పటి వరకు సీఎం జగన్, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ మధ్య వార్ ఉండేది. ఇప్పుడు ఆ వార్ కాస్త.. ఎన్నికల కమిషనర్, ఏపీ స్పీకర్ తమ్మినేని మధ్య షిఫ్ట్ అయింది.

war between ap assembly speaker thammineni seetharam and election commissioner nimmagadda ramesh kumar
తాజాగా… ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డపై రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స ఫిర్యాదు చేశారు. తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని.. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ పై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలంటూ ఇద్దరు మంత్రులు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఫిర్యాదు చేశారు.
దీంతో వెంటనే రంగంలోకి దిగిన స్పీకర్… వాళ్ల ఫిర్యాదును స్వీకరించి… నిమ్మగడ్డపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. వెంటనే దీనిపై ప్రివిలేజ్ కమిటీకి సిఫారసు చేశారు. ప్రివిలేజ్ కమిటీ కూడా వెంటనే ఈ ఫిర్యాదుపై విచారణ ప్రారంభించింది.
సీనియర్ శాసనసభ్యులం, మంత్రులం.. మా హక్కులకే భంగం కలిగిస్తారా?
మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స.. ఇద్దరూ సీనియర్ మంత్రులే. మాలాంటి సీనియర్ మంత్రుల హక్కులకు భంగం కలిగించి… మా గౌరవాన్ని మంట కలిపేలా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహరించారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. గవర్నర్ కు రాసిన లేఖలో మాపై చాలా నిందారోపణలు మోపారు. అవి మమ్మల్ని చాలా బాధించాయి. తీవ్ర మానసిక వేదనకు గురి చేశాయి. అందుకే.. ఆ లేఖ గురించి మీ ప్రస్తావనకు తెస్తున్నాం. మాపై చేసిన నిందారోపణలు అన్నీ నిరాధారం. అవి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారం అవుతున్నాయి. అందుకే వెంటనే నిమ్మగడ్డపై చర్యలు తీసుకోవాలి.. అంటూ మంత్రులు.. స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.