Neelam Sahni : నిమ్మగడ్డ ఔట్… నీలం సాహ్ని ఇన్… ఏపీ ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్ని | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Neelam Sahni : నిమ్మగడ్డ ఔట్… నీలం సాహ్ని ఇన్… ఏపీ ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్ని

 Authored By jagadesh | The Telugu News | Updated on :27 March 2021,9:06 am

Neelam Sahni : గత కొన్ని రోజుల నుంచి ఏపీలో ఇదే చర్చ. ఏపీకి తదుపరి ఎన్నికల కమిషనర్ ఎవరు అవుతారు అని. ఎందుకంటే… ప్రస్తుతం ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్… ఇన్ని రోజులు చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వం సహకరించడం లేదని.. ఏకంగా హైకోర్టులోనే పిటిషన్ దాఖలు చేసి నిమ్మగడ్డ చర్చనీయాంశం అయ్యారు. దీంతో హైకోర్టు కూడా ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. అయినా ప్రభుత్వం వినలేదు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడం కుదరదని స్పష్టం చేసింది. అయినా పట్టుపట్టిన విక్రమార్కుడిలా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించి ఏపీలోనే చర్చనీయంశం అయ్యారు నిమ్మగడ్డ.

neelam sahni appointed as ap election commissioner

neelam sahni appointed as ap election commissioner

అయితే…. నిమ్మగడ్డ పదవీకాలం ఈ నెల 31తో ముగియనుంది. ఆయన రిటైర్ కాబోతున్నారు. దీంతో తదుపరి ఎన్నికల కమిషనర్ ఎవరు అవుతారు.. అనేదానిపై చర్చ జోరుగా సాగుతోంది.

నూతన ఎన్నికల కమిషనర్ విషయంపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారుల పేర్లను గవర్నర్ కు ప్రతిపాదించింది. వాళ్లలో నీలం సాహ్ని పేరును గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఖరారు చేశారు.

ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా ఎంపికైనందుకు నీలం సాహ్నికి ఏపీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. నిమ్మగడ్డ 31న రిటైర్ అయిన తర్వాత తెల్లారే అంటే ఏప్రిల్ 1న నీలం సాహ్ని.. ఏపీ ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

Neelam Sahni : ఇకనైనా సీఎం జగన్ కూల్ అయినట్టేనా?

మొత్తానికి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికల కమిషనర్ స్థానం నుంచి రిటైర్ అవుతుండటంతో సీఎం జగన్ కాస్త ప్రశాంతంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇన్ని రోజులు ఏపీ ప్రభుత్వాన్ని నిమ్మగడ్డ ముప్పు తిప్పలు పెట్టారు. నిజానికి.. నిమ్మగడ్డను ఏపీ ఎన్నికల కమిషనర్ గా అపాయింట్ చేసింది.. చంద్రబాబు ప్రభుత్వం. అందుకే.. నిమ్మగడ్డ… ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పినట్టు విని… ఏపీ ప్రభుత్వాన్ని కావాలని ఇరుకున పెట్టారు… అనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఏది ఏమైనా… ఏపీ ప్రభుత్వానికి, సీఎం జగన్ కు ఉన్న పెద్ద ఇబ్బంది మాత్రం త్వరలోనే పోనుంది. మరి.. వచ్చే ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని అయినా ఏపీ ప్రభుత్వానికి సహకరిస్తారా? లేక ఇబ్బందులకు గురి చేస్తారా? అనేది మాత్రం తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది