Etela Rajender : వాట్ నెక్స్ ట్… ఈటల రూటు ఎటు? ఆయన అనుచరులు ఏమంటున్నారు?
Etela Rajender : ప్రస్తుతం తెలంగాణలో ఈటల రాజేందర్ మంత్రి పదవి తొలగింపు, మెదక్ జిల్లా అచ్చంపేట భూకబ్జా వ్యవహారం మీదనే తెలంగాణ మొత్తం చర్చ నడుస్తోంది. అసలు.. ఆ భూములకు సంబంధించి విచారణ ఇంకా పూర్తి కాలేదు.. ఇప్పుడే విచారణ ప్రారంభం అయింది. అంతలోనే సీఎం కేసీఆర్… ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలంటూ గవర్నర్ కు సిఫారసు చేయడం.. గవర్నర్ కూడా వెంటనే ఆమోద ముద్ర వేయడం తెలంగాణ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈటలపై వరుసగా చేస్తున్న అభియోగాలతో ఆయన అభిమానులు, అనుచరులు ఆందోళన చెందుతున్నారు.
కావాలని ఈటలను చాలా రోజుల నుంచి దూరం చేస్తున్నారని… ఇదంతా ప్లాన్ ప్రకారం ఇప్పుడు చేసుకొచ్చారని… ఆయన అభిమానులు ఆరోపిస్తున్నారు. ఆయన రాజకీయాల్లోకి రాకముందే… ఈటలకు కోళ్ల ఫారాలు, వందల ఎకరాల భూములు ఉన్నాయని… ఆయనపై ఇప్పుడు ఇలాంటి నింద మోపడం శోచనీయం అన్నారు. రాజకీయంగా ఈటలను దెబ్బ తీసేందుకే జరిగిన కుట్ర అని హుజూరాబాద్ లో ఈటల అభిమానులు నిరసన వ్యక్తం చేశారు.
Etela Rajender : టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈటలపై కుట్ర
2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పుడు పార్టీలో అంతర్గతంగా ఇన్ని కుట్రలు లేవు కానీ… 2018 లో రెండోసారి పార్టీ అధికారంలోకి వచ్చాక.. పార్టీలో కుట్రలు స్టార్ట్ అయ్యాయని… అప్పటి నుంచే ఈటలను దూరం పెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. ఆయనకు మంత్రి పదవి కూడా చివరి నిమిషంలో దక్కింది. అప్పటి నుంచే ఆయన్ను తప్పించాలని ప్లాన్ వేసి… అదును చూసి భూకబ్జా వ్యవహారంలో ఆయన్ను ఇరికించారని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు.
Etela Rajender : వాట్ నెక్స్ ట్ ఈటల?
జరిగిందేదో జరిగిపోయింది… ఇప్పుడు మంత్రి పదవి కూడా లేదు. టీఆర్ఎస్ పార్టీ ఈటలను బజారుకీడ్చి పరువు తీసింది. దీంతో ఇప్పుడు ఏం చేయాలి… వాట్ నెక్స్ ట్ అనే దానిపై ఈటల రాజేందర్ సమాలోచనలు చేస్తున్నారట. అందుకే… తన నియోజకవర్గ ప్రజలతో, తన అనుచరులు, అభిమానులతో ఈటల రాజేందర్ త్వరలోనే భేటీ అవుతారట. వాళ్లతో మాట్లాడాక.. వాళ్ల సలహాలు తీసుకొని.. ఆ తర్వాత తదుపరి స్టెప్ వేయాలని ఈటల భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే… తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టే సత్తా ఉన్న పార్టీ బీజేపీ మాత్రమే. అందుకే… ఒకవేళ ఈటల బీజేపీలోకి వెళ్తారా? లేక కొత్త పార్టీ పెట్టడం లాంటి దాని గురించి ఏమైనా ఆలోచిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఆయన తన అనుచరులతో భేటీ అవుతారని తెలుస్తోంది. అలాగే.. టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, మంత్రి పదవికి, తన ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేస్తారా? లేక ఎటువంటి స్టెప్ తీసుకుంటారు అనేది తెలియాలంటే ఇంకో రెండుమూడు రోజులు ఆగాల్సిందే.