shashikala : జైలు నుండి బయటకు వచ్చిన చిన్నమ్మ.. రావడం రావడంతోనే రచ్చ మొదలు పెట్టింది
shashikala :తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లి నాలుగు సంవత్సరాల శిక్ష అనుభవించిన విషయం తెల్సిందే. జయలలిత మృతి చెందిన సమయంలో జైలుకు వెళ్లిన చిన్నమ్మ శశికళ ఇప్పటికి బయటకు వచ్చింది. అమ్మ చనిపోయిన సమయంలో చిన్నమ్మ శశికళ అధికారం దక్కించుకునేందుకు ప్రయత్నించింది. కాని అనూహ్యంగా ఆమె జైలుకు వెళ్లింది. అన్నాడీఎంకే పార్టీ ని మొత్తం తన చుట్టు తిప్పుకునేందుకు ప్రయత్నించిన శశికళ జైలుకు వెళ్లడంతో పట్టుకోల్పోయింది. ఆమె జైలుకు వెళ్లిన సమయంలో అన్నాడీఎంకే నాయకులు ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే తానే ఇప్పటికి అన్నాడీఎంకే పార్టీ అధినేత్రిని అంటూ చెప్పుకుంటుంది.
చిన్నమ్మ వ్యూహం ఏంటీ..
జైలు నుండి బయటకు రావడంతోనే ఆమె వాహనానికి అన్నాడీఎంకే పార్టీ జెండాను పెట్టుకుంది. దాంతో పాటు తానే పార్టీకి అధినేత్రిని అంటూ చెప్పుకుంటుంది. ఇప్పటికే అన్నా డీఎంకే నాయకుల్లో కొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నా డీఎంకే పార్టీ ఆమెను చెన్నైలో అడుగు పెట్టకుండా ప్రయత్నాలు చేస్తుంది. ఆమె పార్టీ కార్యలయం కాని జయలలిత ఇల్లు అయిన పోయేస్ గార్డెన్ కు కూడా వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె వ్యూహం ఏంటీ అనేది తెలియడం లేదు. ఆమె బయటకు వచ్చిన వెంటనే కొత్త పార్టీ తో రాజకీయం మొదలు పెడుతుందనుకుంటే అమ్మ పార్టీ అన్నా డీఎంకే పగ్గాలు చేపట్టే ప్రయత్నం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అన్నాడీఎంకే నిర్ణయం ఏంటో…
ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే ఏ మేరకు సత్తా చాటుతుంది అనేది తెలియడం లేదు. ఖచ్చితంగా అధికారం మాత్రం దక్కించుకునే అవకాశం లేదు. ఆ కారణంగానే పార్టీ కార్యక్రమాల్లో ఆమెను భాగస్వామ్యం చేయాలా లేదా అనేది పార్టీ నాయకుల నిర్ణయంపై ఆదారపడి ఉంటుంది. మే నెలలో జరుగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో చిన్నమ్మ అన్నా డీఎంకేలో ఉంటుందా లేదంటే మరో రకంగా రాజకీయం చేస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి జైలు నుండి రావడమే ఆలస్యం ఆమె అన్నా డీఎంకేలో రచ్చ మొదలు పెట్టింది.