TPCC Chief : టీపీసీసీ అధ్యక్షుడు ఎవరు? సాగర్ ఫలితాలు హైకమాండ్ నిర్ణయాన్ని మార్చుకునేలా చేశాయా?
TPCC Chief : దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తీవ్ర పరాజయం పొందాక వెంటనే కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ.. టీపీసీసీ చీఫ్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తన టీపీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన తన పదవికి రాజీనామ చేసి చాలారోజులు కావస్తున్నా… ఇప్పటి వరకు టీపీసీసీ కొత్త చీఫ్ ను కాంగ్రెస్ హైకమాండ్ నియమించలేదు. అప్పటి నుంచి ఎవరు టీపీసీసీ చీఫ్ అయితే బాగుంటుందనే దానిపై అభిప్రాయాలను హైకమాండ్ సేకరిస్తోంది.
రాబోయే టీపీసీసీ చీఫ్.. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేంత కెపాసిటీ ఉండాలని.. అటువంటి నిఖార్సయిన నాయకుడి కోసం కాంగ్రెస్ హైకమాండ్ వెతుకుతోంది. అయితే… కాంగ్రెస్ హైకమాండ్ కు టీపీసీసీ చీఫ్ గా కనిపించిన నాయకులు ఓ ముగ్గురు నలుగురు మాత్రమే. అందులో ఎక్కువగా పేరు వినపడింది రేవంత్ రెడ్డిదే. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డి వైపే మొన్నటి దాకా మొగ్గు చూపారట. రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
TPCC Chief : అధిష్ఠానం నిర్ణయం మారిందా?
అయితే.. ఇటీవల సాగర్ ఉపఎన్నికలు జరగగా… ఎన్నికల ముందు టీపీసీసీ చీఫ్ ను ప్రకటించవద్దని… సాగర్ ఎన్నికలు జరిగేదాకా ఆగాలని.. హైకమాండ్ ను జానారెడ్డి రిక్వెస్ట్ చేశారట. దీంతో సాగర్ ఉపఎన్నిక ముగిసేవారకు హైకమాండ్.. టీపీసీసీ చీఫ్ జోలికి వెళ్లలేదు. కానీ.. ప్రస్తుతం సాగర్ ఉపఎన్నిక కూడా ముగిసింది. అయితే.. సాగర్ ఉపఎన్నికల్లో జానారెడ్డి గెలుస్తారని.. అప్పుడు టీపీసీసీ చీఫ్ పదవిని ప్రకటిస్తే.. పార్టీ కూడా తెలంగాణలో బలంగా మారుతుందని హైకమాండ్ భావించింది కానీ.. సాగర్ ఉపఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి చెందింది.
నిజానికి.. సాగర్ ఉపఎన్నికల్లో ప్రచార బాధ్యతలను తీసుకున్నది రేవంత్ రెడ్డినే. ఆయనే దగ్గరుండి.. ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సాగర్ నియోజకవర్గం పరిధిలో ప్రతి గ్రామంలో తిరిగారు. ప్రచారం చేశారు. కానీ.. ఉపయోగం లేదు. ఒకవేళ సాగర్ ఉపఎన్నికల్లో జానారెడ్డి గెలిచి ఉంటే.. ఆ క్రెడిట్ రేవంత్ రెడ్డికి వెళ్లి ఉండేది. అప్పుడు జానారెడ్డినే… రేవంత్ రెడ్డి పేరును అధిష్ఠానానికి సూచించేవారు. కానీ.. ప్రస్తుతం జానారెడ్డినే అసలు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడంతో… సాగర్ ఫలితాల తర్వాత హైకమాండ్ నిర్ణయంలో మార్పు వచ్చిందని.. ఎవరిని హైకమాండ్ టీపీసీసీ చీఫ్ గా ఎన్నుకుంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
ప్రస్తుతానికి టీపీసీసీ చీఫ్ పదవి ప్రక్రియను హైకమాండ్ ప్రారంభించినప్పటికీ.. ఎవరికి టీపీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలన్న దానిపై హైకమాండ్ కు కూడా క్లారిటీ లేదట. తెర మీదికి వచ్చిన పేర్లలోనే ఎవరో ఒకరికి మాత్రం టీపీసీసీ చీఫ్ పదవి దక్కుతుందనే అభిప్రాయాలు మాత్రం వ్యక్తం అవుతున్నాయి. చూద్దాం మరి… టీపీసీసీ చీఫ్ పదవి ఎవరికి వరిస్తుందో?