Pawan Kalyan : పెంచినప్పుడు నిలదీయలేదేం పవన్ కళ్యాణ్.?
Pawan Kalyan : పెట్రో ధరల్ని కేంద్రం విపరీతంగా పెంచినప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏనాడూ కేంద్రాన్ని ప్రశ్నించలేదు. కానీ, కేంద్రం ఎప్పుడైతే పెట్రో ధరలపై సుంకాన్ని తగ్గించిందో, ఆ వెంటనే కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపేశారు జనసేన అధినేత. ఇక్కడ పవన్ కళ్యాణ్ రాజకీయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? అని ప్రజలెవరూ జుట్టుపీక్కోవాల్సిన అవసరం లేదు. బీజేపీ, జనసేనకు మిత్రపక్షం గనుక, జనసేన అధినేత హోదాలో.. కేవలం కేంద్రం చేసే పనుల్ని హర్షించడం, హర్షించలేని పక్షంలో మౌనంగా వుండడం మాత్రమే పవన్ కళ్యాణ్ చేయగలరు. అయితే, పవన్ కళ్యాణ్ తీరుని రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు, ప్రజలు తప్పుపట్టకుండా వుంటారా.?
ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీ ఈ విషయంలో పవన్ కళ్యాణ్ మీద ఘాటైన విమర్శలే షురూ చేసింది. పెంచినప్పుడు కేంద్రాన్ని నిలదీయాలి కదా పవన్ కళ్యాణ్.? అంటూ పవన్ కళ్యాణ్ మీద వైసీపీ సోషల్ మీడియా విభాగం విరుచుకుపడుతోంది. వాస్తవానికి రాష్ట్రాలు పెట్రో ధరలపై ప్రత్యేకంగా బాదింది ఏమీ లేదు. కేంద్రమే పెంచుకుంటూ పోయింది. అదే రాష్ట్రాలకూ శాపంగా మారింది. కేంద్రం వసూలు చేస్తున్న పన్నుల వాటా నుంచి, రాష్ట్రాలకు ఇవ్వాల్సింది సరిగ్గా ఇవ్వడంలేదు. ఈ నేపథ్యంలో, రాష్ట్రాలు తమ అవసరాల రీత్యా.. ఆ పెరిగిన ధరల కారణంగా కలిసొచ్చే పన్నుల వాటా (రాష్ట్ర పరిధికి సంబంధించి) సరిపెట్టుకుంటున్నాయంతే. తెలంగాణతో పోల్చితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రో ధరలు కాస్త ఎక్కువ. అదీ నామమాత్రమే.
కేంద్రం గనుక పెట్రో ధరలు ఇంకా ఇంకా తగ్గిస్తే, రాష్ట్రాల్లోనూ పెట్రో ధరలు గణనీయంగా తగ్గిపోతాయి. దాదాపు 50 రూపాయలు పెంచేసి, పది రూపాయలు తగ్గించామని కేంద్రం చెప్పడం వల్ల ప్రజలకు ఒనగూడే ప్రయోజనం ఏమీ వుండదని పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సి వుంటుంది.
అయితే, ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్, కేంద్రం తగ్గించిన పెట్రో ధరలపై స్పందించారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఓ రాజకీయ పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్, ప్రజల తరఫున మాట్లాడగలగాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎలాగైతే ధరల పెరుగుదల విషయంలో నిలదీస్తున్నారో, అదే నిలదీత కేంద్ర ప్రభుత్వంపైనా చేయగలగాలి. కానీ, అలా చేస్తే ఆయన పవన్ కళ్యాణ్ ఎందుకు అవుతారన్నది వైసీపీ విమర్శ.