Telangana : ధనిక రాష్ట్రం తెలంగాణకి కరెంటు కష్టాలు రావడమేంటి.?
Telangana : ధనిక రాష్ట్రం తెలంగాణలో కరెంటు గొప్పల గురించి పదే పదే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు ఊక దంపుడు ప్రసంగాలు చేస్తుంటారు. నిజమే, తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కష్టాలు చాలా చాలా తక్కువ.. ఇతర రాష్ట్రాలతో పోల్చితే. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన తర్వాత తెలంగాణ కరెంటు కష్టాల కారణంగా అంధకారంలోకి వెళ్ళిపోతుందని అప్పటి సమైక్య పాలకులు విమర్శలు చేసిన మాట నిజం. కానీ, తెలంగాణలో కరెంటు కోతలు చాలా చాలా చాలా తక్కువే. పైగా, రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నారు. పరిశ్రమలకు కరెంటు సమస్యలు లేవు. నగరాల్లో అయితే కరెంటు పోవడం అనేది చాలా చాలా అరుదు.
అవసరమైన మేర విద్యుత్తుని ఉత్పత్తి చేసుకోవడం, వీలు చిక్కిన చోట విద్యుత్తుని కొనుగోలు చేయడం.. ఇలా అత్యంత ప్రణాళికా బద్ధంగా తెలంగాణ రాష్ట్రం వ్యవహరిస్తోంది. కరెంటు కోణంలో చూస్తే, తెలంగాణ ప్రభుత్వానికి నూటికి నూరు మార్కులూ వేసెయ్యాల్సిందేనేమో.! కానీ, ఇదంతా మేడిపండు వ్యవహారమేనా.? డిస్కమ్‌లు విద్యుత్ కొనుగోళ్ళకు సంబంధించిన బకాయిల్ని చెల్లించలేదా.? ఔను, చెల్లించలేదని కేంద్రం అంటోంది. బకాయిలు చెల్లించకపోతే, ఒప్పందాలు తాత్కాలికంగా రద్దు.. విద్యుత్ సరఫరా బంద్.. అంటోంది కేంద్రం. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం గుస్సా అవుతోంది. రాష్ట్రానికి కరెంటు ఇవ్వకూడదని కేంద్రం చెప్పడమంటే, అది దేశ ద్రోహం కిందనే లెక్క.. అని గులాబీ పార్టీ నేతలు కేంద్రంపై మండిపడుతున్నారు.
‘బీజేపీ తెలంగాణకు మేలు చేయడం లేదు సరికదా, తెలంగాణను చీకట్లలోకి నెట్టేస్తోంది..’ అంటూ గులాబీ పార్టీ మండిపడుతోంది. ఈ విషయం ఇప్పుడు జనంలోకి బాగా వెళ్ళిపోయింది. అయితే, ధనిక రాష్ట్రం తెలంగాణ ఎందుకు బకాయిలు పెట్టినట్లు.? ఈ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ స్పష్టతనివ్వాల్సి వుంది. ఆ బకాయిలేవో సకాలంలో చెల్లించేసి వుంటే, కేంద్రం హెచ్చరించినప్పుడైనా క్లియర్ చేసి వుంటే.. అసలు ఈ దుస్థితి వచ్చేదే కాదు కదా.?
పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా బకాయిలు పెట్టగా, గడువు లోపల ఆ బకాయీలను ఎలాగైతేనేం చెల్లించేసింది. ‘సమాచార లోపంతోనే మా రాష్ట్రం పేరుని బకాయిల లిస్టులో పెట్టారు..’ అని ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చుకుంది. మరి, తెలంగాణ అలా ధైర్యంగా ఎందుకు చెప్పలేకపోతోంది.?