Munugodu Byelections : టీఆర్ఎస్, కాంగ్రెస్ మునుగోడు అభ్యర్థులు ఎవరు? సర్వేలు చేయించినా అభ్యర్థి ఎవరో తేల్చడం లేదెందుకు?
Munugodu Byelections : తెలంగాణలో మళ్లీ ఉపఎన్నిక జోరు ప్రారంభం అయింది. మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ బీజేపీలో చేరారు. దీంతో మునుగోడుకు ఉపఎన్నిక అనివార్యం అయింది. ఆయన బీజేపీలో చేరడంతో మునుగోడులో బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి ఉండనున్నాడు. అంతవరకు బాగానే ఉంది. మునుగోడులో కోమటిరెడ్డికి ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా. ఎక్కువ శాతం మంది ప్రజలు కోమటిరెడ్డి వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. అందులోనూ అభివృద్ధి కోసమే తాను రాజీనామా చేశానని.. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధే తన లక్ష్యం అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెబుతున్న విషయం తెలిసిందే.
ఈనేపథ్యంలో కోమటిరెడ్డి గెలుపు దాదాపు ఖాయం అయిపోయినట్టే.అందుకే.. అధికార పార్టీ టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను బరిలోకి దించేందుకు తెగ ఆలోచిస్తున్నాయి. కాంగ్రెస్ ది సిట్టింగ్ స్థానం అయినప్పటికీ కోమటిరెడ్డి ఇప్పుడు బీజేపీలోకి వెళ్లడంతో కోమటిరెడ్డికి దీటుగా ఏ అభ్యర్థిని బరిలోకి దింపాలని తెగ కసరత్తు చేస్తోంది. టీఆర్ఎస్ పార్టీ కూడా అభ్యర్థిని బరిలోకి దించలేదు. అసలే అధికార పార్టీ.. ఈ ఎన్నికల్లో అభ్యర్థి ఓడిపోతే ఎలా.. అసలే అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి అని టీఆర్ఎస్ కూడా తెగ టెన్షన్ పడుతోంది.
Munugodu Byelections : అభ్యర్థుల కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్ సర్వేలు
అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దించాలని సీఎం కేసీఆర్ సర్వేలు కూడా చేయిస్తున్నారట. మునుగోడులో పోటీ చేస్తామంటూ చాలామంది ముందుకు వచ్చినప్పటికీ.. ఎవరిని అభ్యర్థిగా బరిలోకి దింపాలనేదానిపై సీఎం కేసీఆర్ కూడా తెగ ఆలోచిస్తున్నారు. 2014 లో మునుగోడు నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిచాడు కానీ.. 2018 ఎన్నికల్లో కోమటిరెడ్డి చేతుల్లో ఓడిపోయాడు. అందుకే.. సర్వే ద్వారా వచ్చే నివేదికల ద్వారా అభ్యర్థిని నిర్ణయించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ కూడా సర్వేలు చేయిస్తోంది. కాంగ్రెస్ నుంచి చాలామంది పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఢిల్లీలో హైకమాండ్ కూడా రాష్ట్రానికి చెందిన పలువురు నేతలను ఢిల్లీకి పిలిపించి మరీ.. అభ్యర్థి విషయంలో చర్చించింది. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లి అభ్యర్థి విషయంలో అధిష్ఠానంతో చర్చించారు. అయినా కూడా సర్వేల మీదనే ఆధారపడి.. సర్వే నివేదికల ప్రకారమే అభ్యర్థిని ఖరారు చేసేందుకు కాంగ్రెస్ సంసిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.