వరల్డ్ విస్కీ డే.. విస్కీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు..
ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు అనేక రోజులను జరుపుకుంటుంటారు. న్యూ ఇయర్ మొదలుకొని వాలెంటైన్స్ డే అని, మదర్స్ డే అని, ఫాదర్స్ డే అని.. ఇలా రక రకాల రోజులను సెలబ్రేట్ చేసుకుంటుంటారు. అయితే మీకు తెలుసా..? మద్యం ప్రియులు ఉత్సాహ పడే రోజు కూడా ఒకటి ఉంది. అదే వరల్డ్ విస్కీ డే. అవును. దీన్ని ప్రతి ఏడాది మే నెలలో మూడో శనివారం రోజున జరుపుకుంటారు. ఈ క్రమంలోనే విస్కీ గురించి పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. ప్రపంచ వ్యాప్తంగా స్కాట్లండ్‌లోనే అత్యధిక విస్కీ ఉంది. అక్కడ ఒక్కో వ్యక్తికి విస్కీని పంచితే సుమారుగా ఒక్కొక్కరికి 4 బ్యారెళ్ల విస్కీ లభిస్తుంది. అంతటి విస్కీ అక్కడ ఉంది.
2. మౌంటెయిన్ డ్యూ అనేది ఒక కూల్ డ్రింక్. అయితే దీన్ని మొదట్లో విస్కీలో కలుపుకునేందుకు తయారు చేశారు.
3. ఒక 30 ఎంఎల్ స్కాచ్ విస్కీ ద్వారా 66 క్యాలరీలు లభిస్తాయి. అంటే ఒక అరటి పండు ద్వారా లభించే క్యాలరీల కన్నా తక్కువే. ఒక అరటి పండును తింటే సుమారుగా 89 క్యాలరీలు లభిస్తాయి.
4. గ్రెయిన్ విస్కీని మొదట 1830లోనే తయారు చేశారు. అయితే మాల్ట్ విస్కీని 1494లో తయారు చేశారు.
5. విస్కీకి సహజంగానే రంగు ఉండదు. కానీ విస్కీని బ్యారెల్‌లలో నిల్వ చేస్తారు కనుక విస్కీ గోధుమ రంగులో, బంగారు రంగులో ఉంటుంది.
6. ప్రపంచంలోనే అతి పెద్ద సింగిల్ మాల్ట్ విస్కీ బాటిల్‌లో 105.3 లీటర్ల విస్కీని ఉంచారు. దాన్ని 2019 డిసెంబర్‌లో రూ.14 లక్షలకు విక్రయించారు.
7. విస్కీని బ్లెండ్ చేయడంలో అత్యంత ప్రతిభ చూపిన మహిళల్లో రేచల్ బెరీ అనే మహిళ మొదటి స్థానంలో నిలిచింది. అందుకు గాను ఆమె ఎంతో మందితో పోటీ పడింది.
8. ప్రపంచంలో అత్యంత ఖరీదైన విస్కీ.. ది మకల్లన్ ఫైన్ అండ్ రేర్ విస్కీ. 1926లో దాన్ని తయారు చేశారు. 93 ఏళ్ల తరువాత దాన్ని 2019 అక్టోబర్‌లో రూ.14.5 కోట్లకు విక్రయించారు.
9. విస్కీని బాటిల్ లో నింపి సీల్ వేస్తే అది ఎన్ని సంవత్సరాలైనా అలాగే నిల్వ ఉంటుంది. పాడు కాదు. అలా నిల్వ చేస్తే విస్కీ 100 సంవత్సరాలు అయినా అలాగే ఉంటుంది.
10. విస్కీని బ్లెండ్ చేసే మాస్టర్ బ్లెండర్స్ వారంలో సుమారుగా 2000 రకాల విస్కీలను వాసన చూస్తారు.