YCP MLA : అమరావతి రైతులతో వైసీపీ ఎమ్మెల్యే.. అధిష్టానం గుర్రు..
YCP : ఏపీలో మూడు రాజధానులు వద్దని అమరావతి ప్రాంత రైతులు అనేక ఉద్యమాలు చేస్తున్నారు. కానీ వీరితో టీడీపీ పార్టీయే ఇలా చేపిస్తోందని అధికార వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అమరావతి ఒక్కటే రాజధాని కాకుండా మరో రెండు రాజధానులను కూడా తేవాలని వైసీపీ భావించింది. అందుకు తగ్గట్లుగా ఓ బిల్లును కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. కానీ ఏమయిందో ఏమో మొన్నటికి మొన్నే ఆ బిల్లును ఉపసంహరించుకుంది.
మరో బిల్లును ప్రవేశపెడతామని తెలిపింది. వైసీపీ నిర్ణయం రైతులకు వ్యతిరేఖంగా ఉందని ఎంత మంది ఎన్ని ఆరోపణలు చేసినా కానీ ప్రభుత్వం మాత్రం తాను అనుకున్నదే చేసేందుకు ముందుకు వెళ్తోంది. ఇక ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలని అమరావతి ప్రాంత రైతులు మహా పాదయాత్రకు తెరలేపారు. ఈ యాత్ర పచ్చి బూటకమని టీడీపీ పార్టీ ఈ యాత్రను స్పాన్సర్ చేస్తోందని వైసీపీ ఆరోపిస్తుంది. కానీ అటువంటి సమయంలో ఓ వైసీపీ ఎమ్మెల్యే చేసిన పని ఆ పార్టీకి కొత్త చిక్కులను తెచ్చి పెడుతోంది.
YCP : ఫోన్ నంబర్ కూడా ఇచ్చిన ఎమ్మెల్యే..
రైతులు చేస్తున్న మహా పాదయాత్ర గుంటూరు, ప్రకాశం జిల్లాల మీదుగా నెల్లూరు జిల్లాకు చేరుకుంది. నెల్లూరులో రైతులు బస చేసిన ప్రదేశానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వెళ్లి రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు కోటం రెడ్డి రైతులను కలిసేందుకు ఎందుకు వెళ్లాడా? అని పార్టీ వర్గాలు ఆలోచిస్తున్నాయి. కానీ అక్కడకు వెళ్లిన కోటం రెడ్డి రైతులతో మాట్లాడుతూ.. మీకు ఎటువంటి ఇబ్బందులున్నా కానీ తనను సంప్రదించాలని ఫోన్ నంబర్ ను కూడా ఇచ్చాడు. రైతులు తమ చిహ్నమైన ఆకుపచ్చ కండువాను వేసుకోమని అడిగితే మాత్రం తనకు కొన్ని ఇబ్బందులున్నాయని తెలిపారు. ఇలా చెప్పడంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఉద్దేశం ఏమై ఉంటుందా? అని పార్టీ వర్గాలు, సీనియర్ నాయకులు ఆలోచిస్తున్నారు. ఆయన స్పీడుకు బ్రేకులు వేయాలని అంటున్నారు.