YS Jagan : విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీస్.. నిర్ణయం తీసేసుకున్న వైఎస్ జగన్.. ప్రారంభం ఎప్పుడో తెలుసా?
YS Jagan : మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గేదేలే అని సీఎం జగన్ చెప్పకనే చెప్పారు. స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా పంద్రాగస్టు నాడు స్వాతంత్ర దినోత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్.. రాష్ట్ర ప్రజలకు మరోసారి మూడు రాజధానుల అంశాన్ని వినిపించారు. అంటే.. వైసీపీ ఇంకా మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గలేదు అని తేటతెల్లమైంది. మూడు రాజధానులతోనే పాలనా వికేంద్రీకరణ సాధ్యం అవుతుందని సీఎం జగన్ బలంగా నమ్ముతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మూడు రాజధానుల అంశం కోర్టులో నలుగుతున్నా.. ఒకటే రాజధాని ముద్దు అంటూ అమరావతి కోసం దీక్షలు జరుగుతున్నా.. మూడు రాజధానులపై వెనక్కి తగ్గేదు లేదని సీఎం జగన్ మరోసారి నిరూపించారు.
YS Jagan : ఇప్పటికే 13 జిల్లాలు.. 26 జిల్లాలు అయ్యాయి
పాలనా వికేంద్రీకరణలో భాగంగానే.. సర్వముఖోభివృద్ధి కోసం వెనుకబడిన ప్రాంతాలు ఎలాంటి వివక్షకు గురి కాకుండా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం జగన్ తన ప్రసంగంలో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పటి వరకు 13 గా ఉన్న జిల్లాలు 26 అయ్యాయి. గ్రామ సచివాలయాలు కూడా పాలనా వికేంద్రీకరణలో భాగమే. మూడు రాజధానుల్లో భాగంగా వైజాగ్ కు పాలనా రాజధాని హోదా కల్పించాలి. దాని కోసం అసెంబ్లీలో చట్టం చేయాలి. అంతకంటే ముందు హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేయాలి.
అందుకే.. ఇదంతా జరిగే సరికి టైమ్ పడుతుంది కాబట్టి… ముందు వైజాగ్ లో సీఎం క్యాంప్ ఆఫీస్ ను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీస్ ను ఏర్పాటు చేసి పాలనా రాజధానిగా దాన్ని అనధికారికంగా ప్రకటించేయాలనే ఆలోచన చేస్తున్నది వైసీపీ ప్రభుత్వం. అందులో భాగంగానే వైజాగ్ లో సీఎం క్యాంప్ ఆఫీసును ప్రకటించడం కోసం దసరాకు ముహూర్తం నిర్ణయించింది.. అనే ప్రచారం సాగుతోంది. విశాఖను రాజధానిగా ఇదిగో ప్రకటిస్తారు.. అదిగో ప్రకటిస్తారు అని వార్తలు వచ్చినప్పటికీ ఇప్పటి వరకు అవేమీ నిజం కాలేదు. మరి.. ఈసారి దసరాకు అయినా విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీసును వైసీపీ ప్రభుత్వం ఓపెన్ చేస్తుందో లేదో వేచి చూడాల్సిందే.