YS Jagan : దటీజ్ వైఎస్ జగన్.. ఆ నలుగురే వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు.!
YS Jagan : చెప్పాడంటే, చేస్తాడంతే.! బీసీలంటే బ్యాక్‌వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్.. అంటూ పదే పదే చెబుతుంటారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఔను, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బ్యాక్‌బోన్ అని భావించబట్టే, బీసీలకు కీలక పదవులు కట్టబెడుతున్నారు. దేశవ్యాప్తంగా ఖాళీ అయిన పలు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు స్థానాలు ఖాళీ అయ్యాయి. వైసీపీ నేత విజయసాయిరెడ్డి, టీడీపీ నుంచి బీజేపీలోకి దూకేసిన సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, చంద్రబాబు హయాంలో స్నేహధర్మం కోటాలో రాజ్యసభ సీటు సంపాదించిన బీజేపీ నేత సురేష్ ప్రభు పదవీ కాలం ముగియడంతో, రాష్ట్రంలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయిన సంగతి తెలిసిందే.
ఈ నాలుగు స్థానాలకుగాను, విజయసాయిరెడ్డిని కొనసాగిస్తూ, మరో ముగ్గురు కొత్తవారికి రాజ్యసభ అవకాశం కల్పించారు వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. కాస్సేపటి క్రితం వైసీపీ ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ.. తమ పార్టీ నుంచి రాజ్యసభకు పోటీ చేసే నలుగురు అభ్యర్థుల వివరాల్ని ప్రకటించారు. వారిలో బీసీ నేత ఆర్.కృష్ణయ్య, ప్రముఖ న్యాయవాది నిరంజన్ రెడ్డి, వైసీపీకి చెందిన మరో కీలక నేత బీద మస్తాన్‌రావులకు అవకాశం దక్కింది.ఆర్.కృష్ణయ్య గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమ నేతగా సుపరిచితుడాయన. గతంలో టీడీపీ నుంచి తెలంగాణ సీఎం అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన ఆర్.కృష్ణయ్య, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు.
వాస్తవానికి, తెలంగాణలో గెలవడానికి టీడీపీకి మరో అవకాశం లేక, ఆర్.కృష్ణయ్యను అరువు తెచ్చుకుంది అప్పట్లో. ప్రత్యక్ష రాజకీయాలకు ఆ తర్వాత దూరమైన ఆర్.కృష్ణయ్య, బీసీ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూనే వున్నారు. ఈ క్రమంలోనే ఆర్.కృష్ణయ్యకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా తగిన గౌరవం లభించిందని చెప్పక తప్పదు. ప్రముఖ న్యాయవాది నిరంజన్ రెడ్డి సినీ నిర్మాత కూడా. బీసీ కోటాలోనే బీద మస్తాన్ రావుకి కూడా రాజ్యసభ అవకాశం కల్పించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. మొత్తం నాలుగు స్థానాల్లో రెండు స్థానాల్ని బీసీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కట్టబెట్టడం గమనించాల్సిన విషయం. తమది బీసీలకు వెననుదన్నుగా నిలిచే పార్టీ అని వైసీపీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.