YS Sharmila : కేసీఆర్ పై మరోసారి మాటల తూటాలు.. షర్మిలమ్మ రాజ్యం వద్దు అంటూ షాకింగ్ కామెంట్స్?
YS Sharmila : వైఎస్ షర్మిల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం షర్మిలే హాట్ టాపిక్. అసలు.. ఏపీని కాదని.. తెలంగాణకు వచ్చి ఆమె పార్టీ పెడుతారని ఎవ్వరూ ఊహించలేకపోయారు. అసలు.. ఆమె ఆలోచనలను కూడా ఎవ్వరూ అందుకోలేకపోయారు. మొత్తానికి తను వైఎస్సార్ బిడ్డ అనిపించుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలను ఒక్కసారిగా మార్చేశారు షర్మిల.
షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతున్నారని.. అప్పట్లో బాగానే గాసిప్స్ వచ్చాయి. వాటిని షర్మిలే తిప్పికొట్టారు. తర్వాత మళ్లీ పార్టీ పెడుతున్నాను.. తెలంగాణలో రాజన్య రాజ్యం తెస్తాను అని ప్రకటించారు. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం వెనుక ఎవరున్నారు? తను ఎవరు వదిలిన బాణం.. అంటూ రాజకీయంగా బాగానే చర్చలు వచ్చినా.. తను సొంతంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం అవుతోంది. త్వరలోనే పార్టీ ప్రకటన, పార్టీ విధివిధానాలను షర్మిల ప్రకటించనున్నారు.
YS Sharmila : షర్మిలమ్మ రాజ్యం వద్దు.. రాజన్న రాజ్యం తెస్తా
అయితే.. తాజాగా లోటస్ పాండ్ లో ఖమ్మం జిల్లా నేతలు, వైఎస్సార్ అభిమానులతో సమావేశమయ్యారు. ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి.. పార్టీ పేరును కూడా అక్కడే ప్రకటించేందుకు షర్మిల సమాయత్తమవుతున్న విషయం తెలిసిందే. దీంతో.. బహిరంగ సభ ఏర్పాటు గురించి షర్మిల ఆ జిల్లా నేతలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన షర్మిల.. తెలంగాణ సర్కారుపై, సీఎం కేసీఆర్ పై విమర్శల యుద్ధం చేశారు. తెలంగాణలో దొరల పాలన నడుస్తోందని.. దొరల పాలనకు చరమగీతం పాడే రోజు దగ్గరికొచ్చిందని ఆమె స్పష్టం చేశారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఏపీ ఎంతో.. తెలంగాణ కూడా అంతే. ఏపీ, తెలంగాణ రెండూ ఆయనకు రెండు కళ్లు. తెలుగు ప్రజలు బాగుండాలని కోరుకున్న వ్యక్తి వైఎస్సార్. ఆనాడు పోడు భూములను పేదలకు పంచిన ఘనత వైఎస్సార్ దే. అందుకే.. తెలంగాణలో నేను షర్మిలమ్మ రాజ్యం తీసుకురావడానికి రాలేదు.. రాజన్న రాజ్యం తీసుకొచ్చేందుకే ముందుకు వచ్చాను.. అని షర్మిల ఈసందర్భంగా స్పష్టం చేశారు.