Konda Murali : కొండా మురళిని పార్టీలో చేర్చుకోవడమా? ఈ జన్మలో జరగదు… షాకిచ్చిన షర్మిల టీమ్?
Konda Murali : ప్రస్తుతం వైఎస్ షర్మిల గురించే తెలంగాణలో చర్చ. వైఎస్ షర్మిల గత మూడు రోజుల నుంచి ఉద్యోగ దీక్ష చేస్తున్నారు. ఇటీవలే ఖమ్మంలో సంకల్ప సభ నిర్వహించారు. మొత్తం మీద తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు షర్మిల బాగానే ప్రయత్నిస్తున్నారు. ఈసందర్భంగా పలు పార్టీల నాయకులు కూడా షర్మిల పార్టీలో చేరేందుకు సమాయత్తమవుతున్నారు. పార్టీలో ఇమడలేని వాళ్లు, పార్టీలో అసంతృప్తితో ఉన్నవాళ్లు, ఇతర కారణాల వల్ల వేరే పార్టీ వైపు చూడాలంటే.. ప్రస్తుతం ఉన్న ఒకే ఒక దారి షర్మిల పార్టీ. జులై 8న పార్టీ పేరు ప్రకటన సభలోనే పలువురు నాయకులు షర్మిల పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం.
అయితే… షర్మిల పార్టీలో నేను చేరేది లేదు… ఆమె పార్టీలో చేరితే నాకు 10 వేల కోట్లు షర్మిల ఇస్తుంది. కానీ నేను కొన్ని విలువలను పాటిస్తాను కాబట్టి షర్మిల పార్టీలో చేరను. ఆ పార్టీలో చేరాలంటూ నాకు కబురు వచ్చింది కానీ నేను చేరట్లేదు… అంటూ వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేత కొండా మురళి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై షర్మిల టీమ్ స్పందించింది. ఆయన చేసిన వ్యాఖ్యలను షర్మిల టీమ్ తీవ్రంగా ఖండించింది. అసలు.. పార్టీలో చేరాలంటూ కొండా మురళిని సంప్రదించలేదంటూ ప్రకటన విడుదల చేసింది.
Konda Murali : కోట్ల రూపాయలు ఇచ్చి కొనుక్కోవడానికి మాది టీఆర్ఎస్ పార్టీ కాదు
అసలు ఆయన్ను పార్టీలో చేరాంటూ తమ టీమ్ సంప్రదించలేదు. ఆ అవసరం కూడా తమకు లేదు… అని వైఎస్ షర్మిల అనుచరుడు పిట్ట రాంరెడ్డి ప్రకటనలో వెల్లడించారు. కోట్ల రూపాయలు వెచ్చించి కొనుక్కోవడానికి మాదేమీ టీఆర్ఎస్ పార్టీ కాదు. విలువల గురించి కొండా మురళి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. కొండా మురళి వాడి పడేసే చెత్త లాంటివారు. ఆయనతో బేరసారాలు చేయాల్సిన అవసరం మాకు లేదు. అసలు.. అలాంటి వాళ్లకు మా పార్టీలో స్థానం లేదు. జన్మలో కూడా అది జరగదు.. అని రాంరెడ్డి స్పష్టం చేశారు.
విలువల గురించి కొండా మురళి మట్లాడుతున్నారు. ఆయన తన రాజకీయ జీవితంలో ఎన్ని గుమ్మాలు తొక్కారో ఎవరికి తెలియదు. ఎన్ని వాకిళ్లు తిరిగారో ఆయనే ఆత్మపరిశీలన చేసుకోవాలి. డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం మా పార్టీకి లేదు. ఆయన విలువల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో షర్మిల పార్టీకి కావాల్సినంత బలం ఉంది. వారు చాలు మాకు. ఇలాంటి వాళ్లు అవసరమే లేదు… అంటూ రాంరెడ్డి కౌంటర్ ఇచ్చారు.