YS Sharmila : ప్రశ్నించేందుకు పార్టీ పెడుతున్నా… ఆరోజు పార్టీ పేరు ప్రకటిస్తా.. ఖమ్మం సభలో షర్మిల | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Sharmila : ప్రశ్నించేందుకు పార్టీ పెడుతున్నా… ఆరోజు పార్టీ పేరు ప్రకటిస్తా.. ఖమ్మం సభలో షర్మిల

 Authored By jagadesh | The Telugu News | Updated on :9 April 2021,10:21 pm

YS Sharmila : వైఎస్ షర్మిల.. ప్రస్తుతం ఈపేరు తెలంగాణ వ్యాప్తంగా మారుమోగిపోతోంది. తెలంగాణలో వైఎస్ షర్మిల పేరు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే తెలంగాణలో పార్టీ పెడుతున్నట్టు ప్రకటించిన వైఎస్ షర్మిల.. తాజాగా ఖమ్మంలో సంకల్ప సభను నిర్వహించారు. ఈ సభకు షర్మిల తల్లి విజయమ్మ కూడా హాజరయి.. తన కూతురు షర్మిలను ఆశీర్వదించారు. అలాగే.. తన కూతురును తెలంగాణ ప్రజలంతా ఆశీర్వదించాలంటూ ఆమె కోరారు.

ys sharmila to launch her new party in telangana on july 8th

ys sharmila to launch her new party in telangana on july 8th

ఆ తర్వాత ఖమ్మం సంకల్ప సభలో ప్రసంగించిన షర్మిల… కేవలం ప్రశ్నించడానికే… నిలదీయడానికే పార్టీని పెడుతున్నా… అంటూ షర్మిల స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీల సంగతి ఏమైంది. ఎన్నికల హామీలను గాలికొదిలేశారా? మీరు ఏది చేస్తే అది చూస్తూ కూర్చుంటామా? ప్రశ్నించడానకే మేము వస్తున్నాం. మిమ్మల్ని నిలదీయడానికే పార్టీ ఉద్భవిస్తోంది అంటూ షర్మిల తెలిపారు.

కేజీ టు పీజీ ఉచిత విద్య ఏమైంది కేసీఆర్ సారు… యువతకు ఉద్యోగాలు ఏవి.. ఫీజు రీయంబర్స్ మెంట్ ఏది? ఇంటికో ఉద్యోగం ఏది? ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే ఇంట్లో ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకోవాలా? నీళ్లు అన్నారు… నిధులు అన్నారు…. నియామకాలు అన్నారు…. ఏమైంది.. నీళ్లు ఎక్కడ ఇచ్చారు… నియామకాలు ఎక్కడ జరిగాయి. కనీసం నిరుద్యోగ భృతి ఇస్తాం అన్నారు.. అదైనా ఇస్తున్నారా? అంటూ షర్మిల ప్రశ్నించారు.

YS Sharmila : సీఎం సారును నిలదీయడానికి మన పార్టీ అవసరం

సీఎం సారును నిలదీయడానికి మన పార్టీ ఎంతో అవసరం. ప్రపంచంలోనే ఏ నాయకుడూ ఆలోచించని సంక్షేమ పథకాలను వైఎస్సార్ ప్రవేశపెట్టారు. ఆనాడు రాజన్న సంక్షేమ పాలనను తీసుకొస్తే.. నేడు కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. వైఎస్సార్ చేపట్టిన ప్రాజెక్టును పక్కన పెట్టి.. రీడిజైన్ పేరుతో లక్షా ముప్పై కోట్లు పెట్టి ప్రాజెక్టులను కట్టారు. అందులో అన్నీ అక్రమాలే. రైతుల పేరు మీద అప్పులు చేస్తున్నారు… జేబులు నింపుకుంటున్నారు. కౌలు రైతులను ఎందుకు పట్టించుకోవడం లేదు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఎక్కడికి పోయాయి. ఏమైంది సీఎం సారు… ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఏది? వైఎస్సార్ ప్రవేశ పెట్టిన అద్భుతమైన పథకం ఆరోగ్యశ్రీ. ఇప్పుడు ఆరోగ్యశ్రీ బకాయిలను ఎందుకు ఆసుపత్రులకు చెల్లించడం లేదు కేసీఆర్ సారు… అంటూ వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.

వీటన్నింటిపై ప్రశ్నించడానికే… నిలదీయడానికే నేను పార్టీ పెడుతున్నా. పార్టీ పేరును, జెండాను, అజెండాను జులై 8 న ప్రకటిస్తాను… అని షర్మిల ఈసందర్భంగా తెలిపారు. 18 ఏళ్ల కింద ఇదే ఏప్రిల్ 8న వైఎస్సార్ తన మొదటి అడుగును వేసి పాదయాత్రను ఇదే తెలంగాణలోని చేవెళ్ల నుంచి ప్రారంభించారని… అందుకే అదే రోజున ఖమ్మం గడ్డ మీద రాజన్న రాజ్యం తేవడం కోసం సంకల్పించాను…. అని షర్మిల స్పష్టం చేశారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది