Karanam Venkatesh : తెలుగుదేశంది ముగిసిన అధ్యాయం, 2024లో మళ్లీ అధికారంలోకి వస్తాం.. కరణం వెంకటేష్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karanam Venkatesh : తెలుగుదేశంది ముగిసిన అధ్యాయం, 2024లో మళ్లీ అధికారంలోకి వస్తాం.. కరణం వెంకటేష్

 Authored By prabhas | The Telugu News | Updated on :14 November 2022,9:40 pm

Karanam Venkatesh : టీడీపీ చరిత్ర ముగిసిందని, చంద్రబాబు వల్ల ఆ పార్టీకి ఎలాంటి ప్రయోజనం లేదని చీరాల నియోజకవర్గం ఇంచార్జి కరణం వెంకటేష్ అన్నారు. సోమవారం తాడేపల్లి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన తెలుగుదేశంపై విరుచుకుపడ్డారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ సంక్షేమం, అభివృద్ధిలో దూసుకెళ్తోందన్నారు. రూ. లక్షా 75 వేల కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల ద్వారా ప్రజల వద్దకు పంపిణీ చేశామన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రగతి బాటలో ఎవరు తీసుకువెళ్తున్నారో ప్రజలందరికీ తెలుసని కరణం వెంకటేష్ స్పష్టం చేశారు. చంద్రబాబు పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు అన్యాయమే జరిగిందని, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 45 ఏళ్ళుగా క్యాబినెట్‌ హోదాలో ఉన్న బాబు వల్ల ఎవరికైనా మంచి జరిగిందా అంటే కుప్పం నియోజకవర్గ ప్రజలకే సమాధానం దొరకటం లేదని వెంకటేష్ విమర్శించారు.

కాబట్టే కుప్పంలో తిరుగుబాటు జరుగుతోందన్నారు. బాబు ఏమీ చేయలేదని… జగన్‌ వచ్చాకే అభివృద్ధి చేస్తున్నారనే ప్రజలు బాబుపై ఈ తిరుగుబాటు చేస్తున్నారని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో 31 లక్షల మందికి ఇళ్లు ఇవ్వడమంటే అది చిన్న విషయం కాదని కరణం వెంకటేష్ అన్నారు. ప్రజలకు మంచి జరిగితే ఓర్చుకోలేక దుష్ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఇన్నేళ్ల అనుభవంలో చంద్రబాబు ఎందుకు ఇలాంటి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయలేకపోయాడని నిలదీశారు. కేవలం మూడున్నర ఏళ్లలోనే సీఎం జగన్ ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చారని, ఈ తేడాను ప్రజలు గమనిస్తున్నారని వివరించారు. చంద్రబాబు గానీ, లోకేష్ గానీ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా ఒక మునిసిపాలిటీ గానీ, గ్రామ పంచాయతీ సీట్లను గానీ గెలుచుకోలేదని, వీళ్లు రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకువెళతారో ప్రజలే ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.

ysrcp leader karanam venkatesh comments on chandrababu

ysrcp leader karanam venkatesh comments on chandrababu

ఈ రోజు పొత్తులు పెట్టుకుంటామంటారన్నారని, మరి గతంలో ఎలా ఉన్నారో కూడా చూడాలని వెంకటేష్ అన్నారు. 2014లో కలిసి పోటీ చేసిన తెదేపా, జనసేనలు 2017లో ఎలా తిట్టుకున్నారో, 2019లో విడిపోయి ఎలా పోటీ చేశారో అందరం చూశామన్నారు. వాళ్లలో వాళ్లే తిట్టుకున్నారని, మళ్లీ ఇప్పుడు కలిసి వచ్చి డ్రామాలు వేస్తున్నారని మండిపడ్డారు. విడివిడిగా 175కి 175 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పే దమ్ము లేదు కానీ అధికారంలోకి రావాలనే ఆశ మాత్రం ఉందని ఎద్దేవా చేశారు. ఆశ ఉంటే చాలదని, పేద, బడుగు బలహీన ప్రజల దీవెనలు ఉండాలని హితవు పలికారు. అది వైఎస్సార్ సీపీకి ఉందన్నారు. నాడు- నేడు ద్వారా జరుగుతున్న అభివృద్ధి, వాలంటీర్ వ్యవస్థ ద్వారా జరుగుతున్న ప్రజల వద్దకే పరిపాలన సీఎం జగన్ ఆలోచనలకు ఒక ఉదాహరణ అని కరణం వెంకటేష్ వివరించారు.

Advertisement
WhatsApp Group Join Now

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది