YSRCP : ప్రతిపక్షాలు బలపడేలా ఊతమిస్తున్న ఆ వైసీపీ ఎమ్మెల్యేలు? తల పట్టుకున్న వైఎస్ జగన్?
ఏపీలో అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న వైసీపీకి ఇప్పుడు ప్రత్యర్ధులు, విపక్షాల నుంచి కాక సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే ముప్పు ఎదురవుతోంది. ముఖ్యంగా ఏపీలో బలపడేందుకు విపక్షాలు చేస్తున్న ప్రయత్నాలకు సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఊతమిస్తున్నారు. కొందరు తమ చర్యలతో, మరికొందరు తమ వ్యాఖ్యలతో సొంత పార్టీని ఇరుకునపెడుతున్నారు. దీంతో వీరిని నియంత్రించలేక అధినేత వైఎస్ జగన్ తలపట్టుకుంటున్నారు. రెండేళ్ల క్రితం భారీ విజయంతో అధికారం చేపట్టిన వైసీపీని ఇరుకున పెట్టేందుకు విపక్షాలకు పెద్దగా అవకాశాలు దొరకలేదు. దీంతో అంది వచ్చిన ఒకటీ అరా సమస్యలతో ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టాయి. తాజాగా ఆ అవసరం లేకుండా వైసీపీ ఎమ్మెల్యేలే విపక్షాలకు అస్త్రాలు ఇస్తున్నారు. సొంత పార్టీ బలహీనతలు తెలిసి కూడా విపక్షాలకు అవకాశమిచ్చేలా వైసీపీ ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్నారు. దీంతో వీరిని నియంత్రించడం సీఎం జగన్ కు, పార్టీ అధిష్టాన పెద్దలకు కష్టంగా మారుతోంది. ఏపీలో బలపడేందుకు విపక్ష బీజేపీ రెండేళ్లుగా చేయని ప్రయత్నం లేదు. పార్టీ అధ్యక్షుడి మార్పు దగ్గరి నుంచి, ఆలయాల్లో విగ్రహాల ధ్వంసాన్ని రాజకీయం చేయడం వరకూ బీజేపీ ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంది. తాజాగా బీజేపీకి మరో రెండు అంశాలు కలిసివచ్చాయి. దీంతో బీజేపీ నేతలు వాటిని అందిపుచ్చుకోవడమే కాకుండా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఓ రేంజ్ లో పావులు కదుపుతున్నారు.
భలే ఛాన్సులే..
బీజేపీ రాష్ట్రంలో బలపడేందుకు ఏం కోరుకుంటుందో అదే జరుగుతోంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి స్ధానికుల కోరికపై టిప్పుసుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు శంఖుస్దాపన చేశారు. అంతటితో ఆగకుండా టిప్పుసుల్తాన్ స్వాతంత్ర సమరయోధుడని కీర్తించారు. దీంతో బీజేపీ భగ్గుమంది. ఇప్పటికీ ఛలో ప్రొద్దుటూరు పేరిట బీజేపీ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు గోవధపై తాజాగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా చిచ్చురేపాయి. కాలం చెల్లిన గోవధ చట్టాన్ని రద్దు చేయాలని చెన్నకేశవరెడ్డి కోరడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. చెన్నకేశవరెడ్డికి వ్యతిరేకంగా రోజూ ఆందోళనలు చేపడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు బీజేపీ అజెండాకు కలిసొచ్చేలా టిప్పు సుల్తాన్ విగ్రహం, గోవధ చట్టాలపై ఇలా వ్యాఖ్యలు చేస్తుండటంతో అధినేత వైఎస్ జగన్ ఇరుకునపడుతున్నారు. గతేడాది ఆలయాల్లో విధ్వంసాలపై వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేసిన బీజేపీ నేతలు ఈసారి టిప్పుసుల్తాన్, గోవధ అంశాల్ని వాడుకుంటూ ప్రభుత్వాన్ని నిత్యం టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఇటు సొంత పార్టీ ఎమ్మెల్యేల్ని నియంత్రించలేక, అటు బీజేపీ నేతలపై ఎదురుదాడి చేయలేక వైఎస్ జగన్ ఇబ్బంది పడుతున్నారు. భవిష్యత్తులో వీరిని నియంత్రించకపోతే బీజేపీయే ప్రధాన ప్రత్యర్ధిగా మారడానికి చేజేతులా అవకాశం ఇచ్చినట్లవుతుందని విశ్లేషకులు సైతం చెబుతున్నారు.