Zoo | జూపార్కులోకి మళ్లీ జీబ్రాలు .. 35 ఏళ్ల తర్వాత కొత్త ఆకర్షణగా మూడు జీబ్రాలు
Zoo | హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ జంతు ప్రదర్శనశాల (జూపార్కు) 62వ జూ డే సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా మూడు జీబ్రాలు సందర్శకుల దృష్టిని ఆకర్షించాయి. గుజరాత్ రాష్ట్రంలోని వంతారా జూపార్క్ నుంచి రెండు ఆడ, ఒక మగ జీబ్రాను జూపార్కు అధికారుల ఆధ్వర్యంలో జూ ప్రాంగణంలోని ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లోకి వదిలారు.
#image_title
కొత్త జీబ్రాలు..
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ సి. సువర్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమె చేతుల మీదుగా జీబ్రాలను సందర్శకులకు వీలుగా ఎన్‌క్లోజర్‌లో ప్రవేశపెట్టారు.1980ల తర్వాత జూపార్కులో జీబ్రాలను చూడలేని స్థితి ఏర్పడింది. దాదాపు 35 ఏళ్ల తర్వాత జీబ్రాలు తిరిగి జూపార్కులో అడుగుపెట్టడం విశేషం. జంతు మార్పిడిలో భాగంగా వంతారా జూపార్క్‌కు 20 మూషిక జింకలను ఇచ్చి, మారుపర్యంగా అక్కడి నుంచి జీబ్రాలను హైదరాబాద్‌కు తరలించారు.
జూ డే సందర్భంగా మరికొన్ని కీలక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఈ సందర్భంగా సింభాల కోసం ప్రత్యేకంగా నిర్మించిన ‘సింభా క్యాంటీన్’, అలాగే ఎలుగుబంట్ల కోసం ఏర్పాటు చేసిన నైట్ హౌజ్‌లను డాక్టర్ సువర్ణ ప్రారంభించారు. జూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, జీబ్రాల రాకతో సందర్శకుల ఉత్సాహం రెట్టింపు అయింది. త్వరలోనే వీటి సంఖ్యను పెంచే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం జీబ్రాలు కొత్త వాతావరణానికి అలవాటు పడుతున్నాయని, ఆరోగ్య పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని జూ అధికారులు తెలిపారు.