Chandrababu : మూడున్నరేళ్ల తర్వాత అసెంబ్లీకి చంద్రబాబు.. అందరి దృష్టి పవన్‌పైనే..!
Chandrababu : ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి అసెంబ్లీ జరగబోతుంది. మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించిన 175 మందీ శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రొటెం స్పీకర్ వారితో ప్రమాణం చేయిస్తారు. ప్రొటెం స్పీకర్‌గా రాజమండ్రి రూరల్‌కు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్నికయ్యారు. పార్టీలకు అతీతంగా అసెంబ్లీలో అందరికంటే సీనియర్ అయిన శాసన సభ్యుడిని ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేయడం ఆనవాయితీ.సీఎం చంద్రబాబునాయుడు సరిగ్గా మూడున్నరేళ్ల తర్వాత ఏపీ అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. 2021 నవంబర్ 19న నిండు సభలో సవాలు చేసి సభ నుంచి నిష్క్రమించిన చంద్రబాబు ఎన్నికల్లో ఘన విజయం సాధించి తిరిగి శాసన సభలోకి అడుగుపెట్టబోతున్నారు.
Chandrababu వారిద్దరిపైనే అందరి దృష్టి..
అసెంబ్లీలో ప్రత్యర్థులు చేసిన రాజకీయ విమర్శలతో కలత చెంది సభను విడిచిపెట్టారు. శాసనసభలో వ్యక్తిగత దూషణలు, హేళనలు, వ్యక్తిత్వ హననం, కుటుంబ సభ్యులపై నిందలు, విమర్శలతో నలిగిపోయిన చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెట్టనని శపథం చేశారు.శాసనసభను కౌరవ సభగా మార్చేశారని, మళ్లీ గౌరవ సభలోనే అడుగుపెడతానని నాడు సభలో సవాలు చేశారు.శాసనసభలో టీడీపీ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని మాట్లాడే వారికి ఎక్కువగా అవకాశం ఇవ్వడానికి ప్రాధాన్యమిచ్చేవారు. ప్రభుత్వ పాలనపై విమర్శలు చేస్తే వ్యక్తిగత విమర్శలతో దాడి చేసేవారు. ఈ క్రమంలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడును అధికార పార్టీ నేతలు అవమానించడంతో మనస్తాపం చెందిన చంద్రబాబు సభలో అడుగుపెట్టనని సవాలు చేశారు.
నేడు సిఎం హోదాలో గౌరవంగా శాసనసభలో నారా చంద్రబాబు నాయుడు అడుగు పెట్టనున్నారు. మళ్లీ సిఎంగానే సభకు వస్తాను అని 2021 నవంబర్ 19న సభలో శపథం చేసిన చంద్రబాబు అన్న ప్రకారమే మూడేళ్లుగా సభకు దూరంగా ఉన్నారు.ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్.. ఈ సభలో ప్రత్యేక ఆకర్షణ కానున్నారు. వారిద్దరూ కూడా తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాకినాడ జిల్లాలోని పిఠాపురం, గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి వారు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గతంలో నారా లోకేష్ శాసనమండలికి నామినేట్ అయ్యారు.