Pithapuram Varma : నన్ను హత్యచేయడానికే దాడి చేశారు.. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన వ్యాఖ్యలు..!
Pithapuram Varma : పవన్ కళ్యాణ్ ఈ సారి పిఠాపురం నుండి పోటి చేయడంతో ఆ నియోజకవర్గం పేరు తెగ మారుమ్రోగిపోయింది. అయితే పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీఎస్‌ఎన్ వర్మ కారుపై దాడి కలకలంరేపింది. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో ఓ కార్యక్రమానికి వర్మ వెళ్లగా, అక్కడ వర్మపై రాళ్ల దాడి జరిగింది. ఆ ఘటనలో ముగ్గురికి గాయాలు కాగా, వర్మ క్షేమంగా బయటపడ్డారు. పిఠాపురం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విజయం సాధించడంతో పాటు .. కూటమి అభ్యర్థుల విజయానికి సహకరించిన వారందరికీ వర్మ కృతజ్ఞతలు తెలియజేస్తూ వర్మ పలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు.
Pithapuram Varma వారే దాడి చేశారు..
శుక్రవారం రాత్రి గొల్లప్రోలు మండలం వన్నెపూడి వెళ్లి సర్పంచ్ కందా సుబ్రహ్మణ్యంను కలిసి మాట్లాడారు వర్మ . ఆ తర్వాత తిరిగి వచ్చి కారు ఎక్కుతున్న సమయంలో ఒక్కసారిగా కొందరు రాళ్లు, ఇటుకలతో దాడి చేశారు. ఈ దాడి చేసింది.. ఆరు నెలల క్రితం తెలుగు దేశం పార్టీ నుంచి నుంచి జనసేన పార్టీలోకి వెళ్లిన 25మంది చేసిన పని అని వర్మ చెబుతున్నారు. జనసేన పార్టీతో తనకు ఎలాంటి ఇబ్బందిలేదన్నారు. పవన్ కళ్యాణ్ ఎలక్షన్ చేసినందుకు గర్వంగా ఉన్నానని.. పవన్ కళ్యాణ్‌తో కలిసి కుటుంబసభ్యుల్లా ఎన్నికల్లో పనిచేశామన్నారు. కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ మనుషులే ఈ కార్యకర్తలు అని వర్మ ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో ఎంపీ విజయం కోసం తాము శ్రమించినా, ఈ దాడి జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగిందని, ఎదురుదాడి చేయడానికి చేతకాక కాదని, తాము సంయమనం పాటిస్తున్నట్లు వర్మ చెప్పారు. టికెట్ త్యాగం చేసేందుకు వర్మను చంద్రబాబు ఒప్పించారు. కూటమి అధికారంలోకి వస్తే గౌరవమైన పదవిని ఇస్తానని హామీనిచ్చారు. పిఠాపురంలో పవన్ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. మొదట్లో సంశయించిన వర్మ… ఆ తర్వాత వెనక్కి తగ్గారు. పవన్ కు మద్దతు ప్రకటించటంతో పాటు… క్యాంపెయినింగ్ లో కీలకంగా పని చేశారు. కూటమి బంపర్ విక్టరీ కొట్టి అధికారంలోకి వచ్చిన వేళ వర్మకు పదవి ఖాయమనే చర్చ జోరుగా జరుగుతోంది. కీలకమైన పదవే రావొచ్చన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.