Balakrishna : నవరత్నాలు వేస్ట్.. అప్పులు ఊబిలో ఏపీని ముంచిన జగన్.. ఆయన్ను సీఎం చేసింది ఏపీ ప్రజలే.. తప్పంతా మీదే.. బాలకృష్ణ ఫైర్
ప్రధానాంశాలు:
ముందు మనలో మార్పు రావాలన్న బాలకృష్ణ
టీడీపీ హయాంలో ప్రతి పండుగను ఉత్సవంలా జరుపుకున్నాం
సంక్షేమ పథకాల పేరుతో అప్పులు ఊబిలోకి నెట్టేస్తున్నారు
Balakrishna : నందమూరి బాలకృష్ణ మరోసారి ఏపీ సీఎం వైఎస్ జగన్ పై రెచ్చిపోయారు. సీఎం జగన్ అరాచక పాలనకు త్వరలోనే ఆంధ్రా ప్రజలకు విముక్తి లభిస్తుందని స్పష్టం చేశారు. తాజాగా టీడీపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన బాలకృష్ణ.. జగన్ సంక్షేమ పథకాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఇవాళ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మనం పాటుపడాలి. మన హక్కుల కోసం మనం పోరాడాలి. ఎస్సీలు, ఎస్టీలపై దాడులు పెరిగాయి. వాళ్లపై అత్యాచారాలు.. ఇష్టారాజ్యంగా జరుగుతోంది. చూస్తూ చూస్తూ వ్యవస్థలన్నీ నిర్వీర్యం అవుతున్నాయి. హిందూపురంలో అభివృద్ధి అనేది మేమే చేస్తున్నాం. టీడీపీ నిధులు, రాజ్యసభ ఎంపీ నిధుల నుంచి తీసుకొచ్చినవే హిందూపురంలో అభివృద్ధి చేస్తున్నాం. ప్రతిపక్షంగా ఉండి కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఒక గొయ్యిని కూడా మట్టితో పూడ్చిన పాపాన ప్రభుత్వం పోలేదు. తప్పు ఎక్కడ ఉంది. తప్పు మనలోనే ఉంది. మనం ఇచ్చాం తప్పు. అది గుర్తుపెట్టుకోండి.. అంటూ బాలకృష్ణ స్పష్టం చేశారు.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పండుగకు ఒక స్కీమ్ తీసుకురావడం, పేదలకు, ఆయా మతస్తులకు ఆర్థిక సాయం చేయడం చేశాం. ఇవాళ అవేమీ జరగడం లేదు. ఇవాళ రాష్ట్రం అప్పులు ఊబిలో కూరుకుపోయింది. అప్పులు ఎవరు తీరుస్తారు. దబ్బిడి దిబ్బిడే. పన్నులు పెంచుతారు.. అన్నీ పెంచుతారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతారు. టిడ్కో ఇండ్లు బ్రహ్మాండంగా కట్టాం. అవి చూస్తే ఇప్పుడు అలాగే పడి ఉన్నాయి. వాటిని ఎందుకు ప్రభుత్వం పేదలకు పంచడం లేదు. టిడ్కో ఇండ్లను పంచితే ఆ క్రెడిట్ టీడీపీకి వస్తుందని భయపడుతున్నారా? పోనీ.. మీరు కట్టించిన ఇండ్లు ఏవి..అంటూ బాలకృష్ణ ప్రశ్నించారు.
Balakrishna : నేరస్తులు, హంతకుల చేతుల్లో పాలన
ప్రస్తుతం ఏపీలో పాలన నేరస్తులు, హంతకుల చేతుల్లో ఉంది. అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రజల హక్కులను కాలరాస్తున్నారు. అందుకే మనలో మార్పు రావాలి. ఆ మార్పుతోనే మన ఏపీ బతుకు బాగుపడుతుంది.. అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు కూడా పాల్గొనడంతో.. బాలకృష్ణ జనసేన జెండా కూడా వేసుకొని ప్రసంగించారు.