Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లపై 27న గుడ్‌న్యూస్ చెప్పనున్న సీఎం రేవంత్ రెడ్డి..?
ప్రధానాంశాలు:
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లపై 27న గుడ్‌న్యూస్ చెప్పనున్న సీఎం రేవంత్ రెడ్డి..?
Indiramma Houses : ఈరోజు ఆదివారం జరగనున్న కలెక్టర్ల సదస్సు అనంతరం ఈనెల 27న రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెబుతారని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నీటిపారుదల పౌరసరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ఆయన పర్యటించారు. పట్టణంలో 12 ఏళ్ల క్రితం నిర్మించి ప్రస్తుతం వాడకం లేకుండా ఉన్న ఇందిరమ్మ ఇళ్లను అధికారులతో కలిసి వీక్షించారు. ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ సమీక్ష సమావేశంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. హుజూర్ నగర్ లో 12 ఏళ్ల క్రితమే 70% పూర్తయి న 2,160 ఇందిరమ్మ ఇళ్లు గత ప్రభుత్వం పట్టించుకోలేదని, వచ్చే మూడు నెలల్లో వీటిని పూర్తి చేస్తామని, రాష్ట్రంలో మొదటిసారి హుజూర్ నగర్ లోనే లబ్ధిదారులకు ఇళ్లను అందజేస్తాం అని అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని, వారి నుంచి గజ స్థలం కూడా వదలకుండా తిరిగి తీసుకుంటామని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా అతి త్వరలోనే రూ. 500 కే గ్యాస్ సిలిండర్ గ్యారెంటీని అమలు చేస్తామని, వివిధ స్థాయిలో ఉన్న రెండు పడక గదుల ఇళ్లను అధికారులు తొందరగా పూర్తి చేసి గ్రామసభల ద్వారా అర్హులను ఎంపిక చేస్తామని అన్నారు. రాష్ట్రంలో పనిచేయని ఎత్తిపోతల పథకాలపై రెండు మూడు రోజుల్లో పూర్తి నివేదిక ఇస్తామని, వాటిపై అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేస్తామని అన్నారు. ఇక భాజాపా ప్రభుత్వం సిఇసి, ఈసీల నియామకం, క్రిమినల్ చట్టాలకు సంబంధించిన నాలుగు వివాదాస్పద బిల్లులను ప్రతిపక్ష సభ్యులు లేకుండా ఆమోదించడం తగదని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మండిపడ్డారు.
పార్లమెంటుపై దాడి ఘటనపై ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా లనుంచి ప్రకటన కోసం పట్టుబడిన ఎంపీలను సస్పెండ్ చేసి కీలక బిల్లులను భాజాపా ప్రభుత్వం ఆమోదించిందని శనివారం ఆయన ఓ ప్రకటనలో విమర్శించారు. ఇకపోతే గత ప్రభుత్వం కేసీఆర్ రెండు పడక గదుల పథకానికి బదులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తిరిగి చేపట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ లో ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు గా ఉంది. గత ప్రభుత్వం గృహ లక్ష్మీ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. కులం, ఆదాయ సర్టిఫికెట్లతో ఎంతోమంది ఈ పథకం కోసం మీ సేవలో వరుస కట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలోనూ గృహలక్ష్మి దరఖాస్తులను పరిశీలించవలసిన అవసరం లేదని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.