Ys jagan : జగన్ పార్టీలో నివురుగప్పిన నిప్పుల అసమ్మతి.. ఎప్పుడైనా బద్దలైపోవచ్చు
Ys jagan 2019 ఎన్నికలో 151 సీట్లు బండ మెజారిటీ సాధించి జగన్ మోహన్ రెడ్డి Ys jagan ముఖ్యమంత్రి అయ్యాడు. దీనితో ఆయన పార్టీలోని అనేక మంది ఆశావహులు మంత్రి పదవుల కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్ చేశారు. కానీ కేవలం 25 మందికి మాత్రమే మంత్రి పదవులు లభించాయి. ఇక మిగిలిన వాళ్ళకు ఉందిలే మంచి కాలం ముందుముందున అంటూ ఆశ చూపించి రెండున్నరేళ్లకు మరోసారి మంత్రి వర్గ విస్తరణ చేపట్టి 90శాతం కొత్త వాళ్ళకి అవకాశం కలిపిస్తామని జగన్ నచ్చచెప్పటంతో ఆశావహులు సైలెంట్ గా వున్నారు.
కాలం గిర్రున తిరిగి రెండేళ్లు అప్పుడే గడిచిపోయాయి. సీఎం జగన్ చెప్పిన సమయానికి మరో ఆరునెలల సమయమే ఉంది. దీనితో గతంలో మంత్రి పదవులు రాని నేతలు ఇప్పటినుండే తమకు తగ్గ రీతిలో ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో అనేక మంది సీనియర్ నేతలు సైతం ఉన్నారు. సీనియర్స్ అనే ట్యాగ్ తగిలించుకున్న నేతలు ఎలాంటి పదవి లేకుండా ఖాళీగా ఉండటం అనేది జరిగే పనికాదు. అలా ఉండటం అంటే రాజకీయంగా వెనకబడి పోయామని అర్ధం.
అందుకే ఈ సరి మంత్రి పదవి కోసం ముమ్మరంగా లాబీయింగులు మొదలెట్టారు. ఇదే సమయంలో తమకు కానీ మంత్రి పదవులు రాకపోతే వైసీపీ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ కండువా కప్పుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు ఆయా నేతలు తమ సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తుంది. రాజకీయ రేస్ లో పదవి లేని నేత ఒక రకంగా ఓడిపోయినట్లే లెక్క. పైగా గతంలో మాదిరి ఏళ్లకు ఏళ్ళు పెద్ద పదవుల కోసం ఎదురుచూసేది లేదు. ఎమ్మెల్యే అయ్యామా.. మంత్రి పదవి దక్కించుకున్నామా అనేది ఇప్పుడు నేతల ఆలోచనలు.
పాతిక మంది మంత్రులను పక్కన పెడితే మిగిలిన 125 మంది ఎమ్మెల్యే ల్లో దాదాపు ఒక పది పదిహేను మందికి నామినేటెడ్ పదవులు ఇచ్చి వాళ్ళని బుజ్జగించాడు జగన్. ఇక తక్కువలో తక్కువగా 100 మంది ఉన్నారు. వీళ్ళలో పదవులు ఆశిస్తున్నా వారి సంఖ్య, దానికి అర్హత కలిగిన వాళ్ళు దాదాపుగా 50 మందిపైగానే ఉన్నారు. ఇప్పుడున్న మంత్రుల్లో 90 శాతం మందిని తొలిగించి 15 మందికి అవకాశం ఇచ్చిన, మరో ముప్పై, నలభై మంది నేతలను బుజ్జగించవలసి ఉంటుంది.
గతంలో మాదిరి ఇప్పుడు కులసమీకరణలు వలన పదవులు ఇవ్వలేకపోతున్నామని సీఎం జగన్ చెప్పిన కానీ వినే స్థితిలో ఎవరు లేరనే చెప్పాలి. పదవి రాకపోతే పార్టీ మారటం ఖాయమంటూ చెపుతున్న కొద్దీ మంది నేతలు కూడా లేకపోలేదు. దీనితో వాళ్ళని బుజ్జగించటం అనేది జగన్ కు తలకు మించి భారం అనే చెప్పాలి. అదే సమయంలో 2019 లో వైసీపీ విజయంలో తమకు కూడా వాటా ఉందని, కానీ అందుకు తగ్గ గుర్తింపు అనేది రాలేదు అనే భావనలో కూడా కొందరు సీనియర్ నేతలున్నట్లు వైసీపీ లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయా నేతలు కూడా అవకాశం చిక్కితే తమ సత్తా కూడా ఏమిటో చూపించాలనే పట్టుదలతో ఉన్నట్లు లీకులు వస్తున్నాయి. వీటిని బట్టి చూస్తే వైసీపీ పార్టీలో అసమ్మతి వర్గం గట్టిగానే ఉందని తెలుస్తుంది. మరో ఆరు నెలల్లో జగన్ తీసుకోబోయే నిర్ణయాల వలన పార్టీలో తీవ్ర అలజడి రావటం ఖాయమే తెలుస్తుంది.