Harirama vs Mudragada : హరిరామ vs ముద్రగడ గా మారిన.. కాపు ఉద్యమ స్ఫూర్తి !
Harirama vs Mudragada : కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం రాసిన ఓ లేఖ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఎందుకంటే.. ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తూ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన పలు విషయాలను ప్రస్తావించారు. ఆ అంశాలపై కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య స్పందించారు. ముద్రగడపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ముద్రగడను కాపు ద్రోహి అంటూ మండిపడ్డారు. ముద్రగడ లేఖపై తాను కూడా ఓ లేఖను రాశారు.
ముద్రగడ అంటే నాకు ఇప్పటి వరకు చాలా అభిమానం ఉండేది. ఆయన చాలా పెద్ద మనిషి అనుకున్నా. కానీ.. పవన్ కళ్యాణ్ కు రాసిన లేఖ చదివాక ఆయన గురించి మొత్తం తెలిసింది. ఆయనపై ఉన్న అభిప్రాయం కాస్త మారిపోయింది. సీఎం జగన్ కు, ముద్రగడకు ఇప్పుడు ఏం తేడా లేదు. కాపు సామాజిక వర్గాన్ని సీఎం జగన్ వద్ద తాకట్టు పెట్టాలని చూస్తున్న వారితో ముద్రగడ కూడా కలిసిపోయారు.. అంటూ దుయ్యబట్టారు.
Harirama vs Mudragada : పవన్ కళ్యాణ్ నీతిమంతుడు అన్న హరిరామ
పవన్ కళ్యాణ్ నీతిమంతుడు. బడుగు, బలహీన వర్గాల కోసం ఆయన శ్రమిస్తున్నారు. వాళ్లకు రాజ్యాధికారాన్ని కట్టబెట్టడం కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకుడు అంటూ హరిరామ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ పై ఇలాంటి ఆరోపణలు చేయడం వెనుక ఎవరు ఉన్నారో మాకు తెలియదా అంటూ ముద్రగడపై హరిరామ మండిపడ్డారు. కాపు కులంలో పుట్టి ఇలాంటి పనులు చేయడం ఏంటి.. వైఎస్ జగన్ కు ఎవరు బినామీగా ఉన్నారో… అందరికీ తెలుసు. వైసీపీలో కాపు వ్యక్తిని సీఎం అభ్యర్థిగా ప్రకటించేలా సీఎం జగన్ కు ముద్రగడ ఒప్పిస్తారా? అంత దమ్ము ఉందా? అంటూ ముద్రగడను ప్రశ్నించారు.