Bank of Bhagyalakshmi Movie Review : బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి.. మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!
ప్రధానాంశాలు:
Bank of Bhagyalakshmi Movie Review : దీక్షిత్ శెట్టి ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’..మూవీ రివ్యూ!
Bank of Bhagyalakshmi Movie Review : కన్నడలో రూపొందిన తాజా సినిమా ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’ లో దీక్షిత్ శెట్టి కథానాయకుడిగా నటించారు. అభిషేక్ మంజునాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గత ఏడాది నవంబర్ 28న థియేటర్లలో విడుదలైంది. థియేటర్లలో పెద్దగా హడావుడి చేయలేకపోయిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నెల 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతూ కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. గ్రామీణ నేపథ్యంలో ఒక చిన్న బ్యాంక్ చుట్టూ తిరిగే దొంగల కథగా ఈ సినిమా రూపొందింది.
Bank of Bhagyalakshmi Movie Review : బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి.. మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!
Bank of Bhagyalakshmi Movie Review : కథా సారాంశం
కనక (దీక్షిత్ శెట్టి) చిన్నప్పుడే తన స్నేహితులతో కలిసి చేసిన ఒక చిన్న దొంగతనంతో జీవితాంతం ‘దొంగ’ అనే ముద్ర వేసుకుంటాడు. ఊరిలో ఎవరు చూసినా అదే గుర్తింపు. ఎంత ప్రయత్నించినా ఆ ముద్ర నుంచి బయటపడలేకపోయిన కనక అందరూ దొంగనే అంటున్నారు కదా… అయితే నిజంగానే దొంగగా జీవిద్దాం అనే నిర్ణయానికి వస్తాడు. అలా చిన్నచిన్న చోరీలు చేస్తూ కాలం గడుపుతుంటాడు. ఒక దశలో ఇక ఇలా బతకడం వృథా అని భావించిన కనక తన జీవితాన్ని ఒకే దెబ్బతో మార్చుకోవాలని అనుకుంటాడు. చిన్న దొంగతనాలకంటే పెద్ద దోపిడీ చేసి లైఫ్‌లో సెటిల్ అయిపోవాలన్న ఆలోచనకు వస్తాడు. అతని స్నేహితులు కూడా అదే ప్లాన్‌కు ఒప్పుకుంటారు.
ఎన్నికల సమయం కావడంతో నగరాల్లోని బ్యాంకులు కఠిన భద్రతలో ఉంటాయని గ్రహించిన వారు గ్రామంలో ఉన్న ఒక బ్యాంక్‌ను టార్గెట్ చేస్తారు. వాళ్లు ఎంచుకున్నది ‘భాగ్యలక్ష్మి కో-ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్’. ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం ఐదుగురు బ్యాంక్‌లోకి చొరబడి సిబ్బందిని, కస్టమర్లను భయపెట్టి డబ్బు దోచుకుంటారు. కానీ అక్కడ దొరికిన నగదు కొన్ని లక్షలకే పరిమితం కావడంతో నిరాశ చెందుతారు. అదే సమయంలో బ్యాంక్‌లోని అండర్‌గ్రౌండ్‌లో ఉన్న ఒక రహస్య గదిని గుర్తిస్తారు. అక్కడ వందల కోట్ల రూపాయలు ఉండటాన్ని చూసి షాక్ అవుతారు. చిన్న గ్రామ బ్యాంకులో ఇంత భారీ మొత్తం ఎలా వచ్చిందన్న సందేహం వారిని వెంటాడుతుంది. ఆ డబ్బు ఎవరిది? దాని వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? కనక గ్యాంగ్ చివరకు ఏ నిర్ణయం తీసుకుంటుంది? అన్నదే మిగతా కథ.
Bank of Bhagyalakshmi Movie Review : విశ్లేషణ
తక్కువ బడ్జెట్ సినిమాలు అంటే ఒకప్పుడు దెయ్యాల కథలు, బంగ్లాల చుట్టూ తిరిగే స్క్రిప్టులు ఎక్కువగా కనిపించేవి. కానీ ఇప్పుడు దర్శకులు పరిమిత లొకేషన్లలో కొత్త కాన్సెప్ట్స్‌తో కథలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. జైలు, ఆఫీస్, మాల్ లాంటి చోట్ల కథలను నడిపించినట్లే ఈ సినిమా మొత్తం ఒక బ్యాంక్ చుట్టూనే తిరుగుతుంది. ఇక్కడ కథ మూడు కోణాల్లో సాగుతుంది. ఒకవైపు బ్యాంక్‌లో చిక్కుకున్న దొంగల గ్యాంగ్మ రోవైపు పోలీసులు ఇంకొకవైపు రాజకీయ నాయకులు. వీటన్నింటి మధ్య బ్యాంక్‌లో ఉన్న భారీ డబ్బు కథను ముందుకు నడిపిస్తుంది.
ఈ దొంగలు ఆ డబ్బుతో బయటపడతారా? అసలు ఆ డబ్బును అక్కడ దాచినవాళ్లు ఎవరు? అన్న ప్రశ్నలతో ఆసక్తి కలిగించడానికి దర్శకుడు ప్రయత్నించాడు. అయితే కథ పరంగా చూస్తే ఇది చాలా సింపుల్ లైన్. ఒక కీలకమైన ట్విస్ట్ ఉన్నప్పటికీ అది చాలా ఆలస్యంగా వస్తుంది. ఆ దాకా సిల్లీ కామెడీతో కాలం గడిపినట్టు అనిపిస్తుంది. ప్రేక్షకులను నవ్వించాలనే ప్రయత్నం ఎక్కువగా కనిపించినా ఆ కామెడీ పెద్దగా వర్క్ అవ్వదు. అలాగే పాత్రలకు ఎలాంటి ప్రమాదం వస్తుందన్న టెన్షన్ కూడా ప్రేక్షకుల్లో కలగదు. ఫలితంగా సినిమా ఎటూ తేలకుండా సాగిపోతుంది.
Bank of Bhagyalakshmi Movie Review : పనితీరు.. ముగింపు
దర్శకుడు ఈ కథను మరింత సీరియస్‌గా చెప్పాల్సిన చోట దాన్ని లైట్‌గా తీసుకున్నట్టు అనిపిస్తుంది. బయట పోలీసులు, రాజకీయ నాయకులు, మీడియా హడావుడి చేస్తుంటే లోపల బ్యాంక్‌లో దొంగలు కామెడీ చేయడం టోన్‌ను పూర్తిగా గందరగోళంగా మారుస్తుంది. ఏ ట్రాక్ కూడా ప్రేక్షకులతో బలమైన కనెక్షన్ ఏర్పరుచుకోలేకపోవడం ప్రధాన లోపం. సాంకేతికంగా సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం, ఎడిటింగ్ అన్నీ ఓ మాదిరిగానే అనిపిస్తాయి. నటీనటులకు బలమైన పాత్రలు లేకపోవడంతో వారి నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునే అవకాశం ఉండదు. ఇక మొత్తంగా చూస్తే బలమైన కంటెంట్ లేకుండా నాలుగు గోడల మధ్య నడిచిన మరో ప్రయోగాత్మక ప్రయత్నంగా ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’ మిగిలిపోతుంది. ఒక ట్విస్ట్ కొద్దిపాటి కామెడీ మీద నడిపించాలన్న ప్రయత్నం ఫలించకపోవడంతో ఇది సగటు ప్రేక్షకుడికి అసహనాన్ని కలిగించే సినిమాగా మారింది.