Indiramma Bima Ration Card : రేషన్ కార్డు ఉన్నవారికి కీలక అప్‌డేట్‌.. ఇందిరమ్మ బీమా నమోదుకు ప్రభుత్వం కొత్త రూల్స్!

Authored By Ramalingaiah Tandu | The Telugu News | Updated on: November 21, 2026, 2:40 pm

Indiramma Bima Ration Card  : తెలంగాణలో రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలకు కీలక సమాచారం. కుటుంబ పెద్ద లేదా కుటుంబాన్ని పోషించే వ్యక్తికి అనుకోకుండా ఏదైనా జరిగితే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం కొత్త జీవిత బీమా పథకాన్ని తీసుకొచ్చింది. అదే ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’. ఈ పథకం కింద అర్హత కలిగిన కుటుంబంలోని ఒక వ్యక్తికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించనున్నారు. బీమా పొందిన వ్యక్తి మరణిస్తే నామినీలకు ఆ మొత్తం అందుతుంది. తాజాగా ఈ పథకంలో నమోదు, అర్హత, అవసరమైన పత్రాలు, నామినీల ఎంపికపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యంగా రేషన్ కార్డు నంబరునే దరఖాస్తు సంఖ్యగా ఉపయోగించనున్నారు. ఆధార్, మొబైల్ నంబర్, ఓటీపీ ధ్రువీకరణతోపాటు రేషన్ కార్డు ఈ-కేవైసీ పూర్తి కావడం కూడా అవసరం.

Indiramma Bima Ration Card : రేషన్ కార్డు ఉన్నవారికి కీలక అప్‌డేట్‌.. ఇందిరమ్మ బీమా నమోదుకు ప్రభుత్వం కొత్త రూల్స్!

Indiramma Bima Ration Card : రేషన్ కార్డు ఉన్నవారికి కీలక అప్‌డేట్‌.. ఇందిరమ్మ బీమా నమోదుకు ప్రభుత్వం కొత్త రూల్స్!

Indiramma Bima Ration Card ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు ఎవరు అర్హులు? రూ.5 లక్షలు ఎవరికి అందుతాయి?

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకంలో ప్రతి కుటుంబం నుంచి ఒక్కరికి మాత్రమే జీవిత బీమా సదుపాయం ఉంటుంది. కుటుంబ పెద్ద లేదా కుటుంబానికి ప్రధానంగా ఆదాయం సమకూర్చే వ్యక్తిని బీమా పరిధిలోకి తీసుకుంటారు. ఆ వ్యక్తి వయసు నమోదు సమయంలో 18 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉండాలి. ఒకే కుటుంబంలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది సంపాదిస్తున్నట్లయితే ఎవరికి బీమా తీసుకోవాలో కుటుంబ సభ్యులే నిర్ణయించుకోవచ్చు. బీమా పొందిన వ్యక్తి మరణించినప్పుడు ముందుగా నమోదు చేసిన నామినీలకు రూ.5 లక్షల ఆర్థిక భరోసా అందుతుంది. ఈ పథకానికి సంబంధించిన బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. అయితే ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలవుతున్న జీవిత బీమా, ఇతర బీమా పథకాలు యథావిధిగా కొనసాగుతాయి. ఆయా పథకాల పరిధిలో లేని కుటుంబాలను కొత్త పథకంలో నమోదు చేయాలని తాజా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

వయసు లెక్కింపు ఎలా? ఆధార్‌లో తప్పులుంటే ఏం చేయాలి?

ఈ పథకంలో వయసు నిర్ధారణకు ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటారు. ఆధార్‌లో పూర్తి పుట్టిన తేదీ కాకుండా పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంటే జులై 1వ తేదీని జన్మదినంగా పరిగణిస్తారు. పుట్టిన తేదీ లేదా సంవత్సరంలో తప్పులు ఉన్నట్లయితే ముందుగా ఆధార్ వివరాలను సరిచేసుకోవాలి. ఆ తర్వాతే బీమా నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి. లేకపోతే వయసు ధ్రువీకరణ సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

రేషన్ కార్డు నంబరే అప్లికేషన్ నంబర్!

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదులో ఆహార భద్రత కార్డు కీలకంగా మారింది. తాజా మార్గదర్శకాల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డు నంబరునే దరఖాస్తు సంఖ్యగా, ప్రత్యేక గుర్తింపు సంఖ్యగా ఉపయోగించనున్నారు. నమోదు సమయంలో రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యుల వివరాలను పౌరసరఫరాల శాఖ డేటాతో సరిపోల్చి పరిశీలిస్తారు. అనంతరం బీమా పొందే వ్యక్తి, నామినీల వివరాలను నమోదు చేస్తారు. ఇంకా రేషన్ కార్డు ఈ-కేవైసీ పూర్తి చేసుకోని కుటుంబాలు ముందుగా ఆ ప్రక్రియను పూర్తిచేయాలని ప్రభుత్వం సూచించింది. తద్వారా నమోదు సమయంలో వివరాల్లో తేడాలు, అనర్హతలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు.

ఇందిరమ్మ బీమా దరఖాస్తు ఎలా? నామినీ వివరాలు, అవసరమైన పత్రాలివే!

బీమా కోసం ఎంపిక చేసుకున్న వ్యక్తి స్వయంగా ప్రభుత్వం నిర్వహించే నమోదు శిబిరానికి వెళ్లాలి. అక్కడ తన వ్యక్తిగత వివరాలతోపాటు నామినీల సమాచారాన్ని అందించాలి. దరఖాస్తుదారులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు ప్రతులు, పనిచేసే మొబైల్ నంబర్ తీసుకెళ్లాలి. ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక వెబ్‌సైట్, మొబైల్ అప్లికేషన్ ద్వారానే అధికారిక నమోదు జరుగుతుంది. ఓటీపీ ఆధారిత ధ్రువీకరణ తప్పనిసరి. అనారోగ్యం లేదా దివ్యాంగత్వం కారణంగా శిబిరానికి రాలేని వారికి ప్రత్యేక సదుపాయం కల్పించాలని ప్రభుత్వం సూచించింది. అలాంటి వారి ఇళ్లకు శిబిరం ఇన్‌ఛార్జి వెళ్లి అవసరమైన వివరాలు సేకరించి నమోదు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ పథకంలో ఒకరి కంటే ఎక్కువ మందిని నామినీలుగా ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. అయితే బీమా మొత్తం రూ.5 లక్షలను ఎవరికి ఎంత నిష్పత్తిలో ఇవ్వాలో నమోదు సమయంలోనే స్పష్టంగా తెలియజేయాలి. ఉదాహరణకు ఇద్దరు నామినీలను ఎంపిక చేసుకున్న కుటుంబం వారికి సమానంగా లేదా తాము నిర్ణయించిన నిష్పత్తిలో మొత్తాన్ని కేటాయించవచ్చు. ఆ వివరాలను అధికారికంగా నమోదు చేయాలి. నామినీ మైనర్ అయితే బీమా క్లెయిమ్‌ను అతడి తరఫున స్వీకరించేందుకు మేజర్ అయిన సంరక్షకుడి వివరాలు కూడా అందించాలి. అలాగే బీమా పొందిన వ్యక్తి కంటే ముందే నామినీ మరణించినా, ఇతర కారణాలతో నామినీని మార్చుకోవాలనుకున్నా నిబంధనల ప్రకారం మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది.

59 ఏళ్లు దాటితే బీమా ఆగిపోతుందా?

ఈ పథకంలో బీమా రక్షణ ప్రారంభమైన తేదీ నుంచి సంబంధిత పాలసీ సంవత్సరం పూర్తయ్యే వరకు కొనసాగుతుంది.బీమా ప్రారంభమైన తర్వాత పాలసీ సంవత్సరం మధ్యలోనే వ్యక్తి గరిష్ఠ వయోపరిమితిని దాటినా ఆ సంవత్సరం ముగిసే వరకు కవరేజీ ఉంటుంది. అయితే తదుపరి పాలసీ సంవత్సరానికి సంబంధించిన అర్హత ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణయిస్తారు.

జిల్లా కలెక్టర్లకు కీలక బాధ్యతలు

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం సక్రమంగా అమలయ్యేలా జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది.నమోదు శిబిరాల నిర్వహణ, లబ్ధిదారుల వివరాల పరిశీలన, అధికారుల మధ్య సమన్వయాన్ని కలెక్టర్లు పర్యవేక్షించాలి. ప్రతి జిల్లాలో అదనపు కలెక్టర్ లేదా సీనియర్ అధికారిని నోడల్ అధికారిగా నియమించాలి.అలాగే ప్రతి మండలం, పురపాలికకు జిల్లా స్థాయి అధికారిని సమన్వయ అధికారిగా నియమిస్తారు. గ్రామ పంచాయతీలు, వార్డుల స్థాయిలో తహసీల్దార్లు, ఎంపీడీవోలు లేదా డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లకు సమన్వయ బాధ్యతలు అప్పగించనున్నారు.నమోదు సమయంలో వివరాలను పరిశీలించి, తప్పుల్లేకుండా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. లబ్ధిదారుల ధ్రువీకరణను సంబంధిత కుటుంబం స్వస్థల జిల్లాలో నిర్వహించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పించే లక్ష్యంతో రూపొందింది. అయితే రేషన్ కార్డు ఉన్నంత మాత్రాన నమోదు లేకుండానే బీమా అమలవుతుందని భావించకూడదు. అర్హత పరిశీలన, ఈ-కేవైసీ, నామినీ నమోదు, అధికారిక ధ్రువీకరణ ప్రక్రియలను పూర్తి చేసుకోవాలి.

Also Read :  Samantha Son : సమంత కొడుకు పేరు ‘దేవ్ నిడిమోరు’.. ఈ అందమైన పేరుకు అర్థం ఏంటో తెలుసా?

ముఖ్య గమనిక: రూ.5 లక్షలు అనేది బీమా మొత్తం. ప్రతి రేషన్ కార్డుదారుడికి నేరుగా నగదు జమ చేసే పథకం కాదు. బీమా పొందిన వ్యక్తి మరణించిన సందర్భంలో, పాలసీ నిబంధనలకు అనుగుణంగా నామినీలకు క్లెయిమ్ చెల్లించబడుతుంది.

Ramalingaiah Tandu

Author Bio Info : Ramalingaiah Tandu is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Tags :
    1. "Indiramma Bima Ration Card : రేషన్ కార్డు ఉన్నవారికి కీలక అప్‌డేట్‌.. ఇందిరమ్మ బీమా నమోదుకు ప్రభుత్వం కొత్త రూల్స్!"

    2. "Indiramma Houses : జవహర్‌నగర్ ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి.. వజ్రేష్ యాదవ్ డిమాండ్!"

    3. "Samantha Son : సమంత కొడుకు పేరు ‘దేవ్ నిడిమోరు’.. ఈ అందమైన పేరుకు అర్థం ఏంటో తెలుసా?"

    4. "Motakondur : మోటకొండూరును అసెంబ్లీ నియోజకవర్గంగా ప్రకటించాలి.. తహసీల్దార్‌కు వినతిపత్రం !"

    5. "Shadnagar Realtors Association : షాద్‌నగర్‌లో ఎన్నికల హీట్.. అధ్యక్ష పదవికి ఇద్దరు అభ్యర్థుల మధ్య గట్టి పోటీ!"

    6. "Gunde Ninda Gudi Gantalu Today Episode : సుమతి, అరుణ్ పెళ్లి కోసం మీనా సంచలన నిర్ణయం.. బాలు మాటలతో కన్నీళ్లు!"

    7. "Gold Rate Today : 21 నవంబర్ 2026 బంగారం కొనాలనుకునేవారికి బంపర్ ఛాన్స్.. వెండి ధర కూడా భారీగా తగ్గింది.!"

    Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
    WhatsApp