Korean Kanakaraju Movie Review : కొరియన్ కనకరాజు మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 7 August 2026, 12:05 am
  •  Korean Kanakaraju Movie Review వరుణ్ తేజ్, రితికా నాయక్ జంటగా మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ‘కొరియన్ కనకరాజు’ మూవీకి ప్రీమియర్ షోల తర్వాత పాజిటివ్ ట్విట్టర్ టాక్ వినిపిస్తోంది. వరుణ్ నటన, సత్య కామెడీ, థమన్ బీజీఎం సినిమాకు హైలైట్‌గా నిలిచాయని ప్రేక్షకులు చెబుతున్నారు.

Korean Kanakaraju Movie Review : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ varun tej వరుస పరాజయాలతో సతమతమవుతున్న సమయంలో ఎంతో కీలకంగా భావించిన చిత్రం ‘కొరియన్ కనకరాజు’. హారర్ కామెడీ జానర్‌లో దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుండగా, గురువారం రాత్రి ప్రత్యేకంగా పెయిడ్ ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. ఈ షోల అనంతరం సోషల్ మీడియాలో, ముఖ్యంగా ట్విట్టర్ (X)లో సినిమా గురించి భారీగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం వినిపిస్తున్న తొలి స్పందనల ప్రకారం, వరుణ్ తేజ్ నటన, సత్య కామెడీ టైమింగ్, థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా వరుణ్ తేజ్‌కు చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందిస్తుందా? అనే చర్చ మొదలైంది.

Korean Kanakaraju Movie Review : కొరియన్ కనకరాజు మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Korean Kanakaraju Movie Review : కొరియన్ కనకరాజు మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Korean Kanakaraju Movie Review  : వరుస ఫ్లాప్‌ల తర్వాత వరుణ్ తేజ్‌కు కీలక పరీక్షగా మారిన ‘కొరియన్ కనకరాజు’

గత కొన్నేళ్లుగా వరుణ్ తేజ్ నటించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’, ‘గని’, ‘గాండీవధారి అర్జున’, ‘మట్కా’ వంటి చిత్రాలు ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. ఒక సినిమా తర్వాత మరో సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో, అభిమానులు కూడా ఈసారి మంచి కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లోనే ‘కొరియన్ కనకరాజు’ సినిమాతో వరుణ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం ఆయన కెరీర్‌కు అత్యంత కీలకమనే అభిప్రాయం సినీ వర్గాల్లో కూడా వ్యక్తమవుతోంది. అందుకే ప్రీమియర్ షోల తర్వాత వచ్చిన తొలి స్పందనలపై అందరి దృష్టి పడింది. దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రాన్ని పూర్తి హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఇందులో రితికా నాయక్ హీరోయిన్‌గా నటించగా, దక్షా నగార్కర్ ప్రత్యేక పాటలో సందడి చేసింది. అలాగే సత్య, మురళీధర్ గౌడ్, బుల్లిరాజు రేవంత్ ఇతర కీలక పాత్రల్లో కనిపించారు.ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. సంగీతాన్ని ఎస్. థమన్ అందించగా, సినిమాటోగ్రఫీని మనోజ్ రెడ్డి నిర్వహించారు. సినిమా విడుదలకు ముందే విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని పెంచాయి. అదే ఉత్సాహం ప్రీమియర్ షోలలో కూడా కనిపించింది. అనేక ప్రాంతాల్లో షోలు హౌస్‌ఫుల్ కావడం విశేషం.

Korean Kanakaraju Movie Review హారర్, కామెడీ కలయికలో సాగిన కథ

రాయలసీమలోని పెనుకొండ ప్రాంతానికి చెందిన కనకరాజు (వరుణ్ తేజ్) చెక్కభజన బృందాన్ని నడుపుతూ సాధారణ జీవితం గడుపుతుంటాడు. తండ్రి చేసిన అప్పులు అతడిని వెంటాడుతుంటాయి. విదేశాలకు వెళ్లిన అన్నయ్య తిరిగి రాకపోవడంతో కుటుంబ బాధ్యతలన్నీ కనకరాజుపైనే పడతాయి. ఎంత కష్టపడి సంపాదించినా ఖర్చు పెట్టకుండా ప్రతి రూపాయిని బ్యాంకులో జమ చేస్తూ ఉంటాడు. అదే గ్రామానికి చెందిన చైత్ర (రితికా నాయక్)కి కొరియా అంటే విపరీతమైన అభిమానం. ఎప్పటికైనా కొరియా వెళ్లి అక్కడే స్థిరపడాలని ఆమె కల. ఆమెను ప్రేమించిన కనకరాజు జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది. ఒకరోజు కొరియా నుంచి వచ్చిన ఓ ఆత్మ అతడి శరీరంలోకి ప్రవేశిస్తుంది. అప్పటి నుంచి కనకరాజు ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. ఆ ఆత్మకు ఒక అసంపూర్తి కోరిక ఉంటుంది. అది నెరవేరాలంటే తప్పనిసరిగా కొరియా వెళ్లాలి. ఆ ఆత్మ నుంచి బయటపడాలంటే కనకరాజు కూడా కొరియా వెళ్లాల్సిందే. దీంతో కనకరాజు, చైత్ర, కృష్ణప్ప (సత్య) కలిసి కొరియాకు ప్రయాణం చేస్తారు. అక్కడ ఏమి జరిగింది? ఆ కొరియన్ ఆత్మ అసలు ఎవరు? ఆమె కోరిక వెనుక ఉన్న నిజం ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

Korean Kanakaraju Movie Review కొత్త కాన్సెప్ట్ ఉన్నా.. స్క్రీన్‌ప్లే పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు

తెలుగు సినిమాల్లో ఆత్మ కథలు కొత్తేమీ కావు. కానీ ఈసారి దర్శకుడు కొరియా నేపథ్యాన్ని ఎంచుకోవడం మాత్రం ప్రత్యేకంగా అనిపిస్తుంది. కొరియన్ ఆత్మ రాయలసీమ వ్యక్తిని ఆవహించడం, దాని నుంచి బయటపడేందుకు హీరో కొరియాకు వెళ్లడం వంటి కథాంశం వినడానికి ఆసక్తికరంగానే ఉంటుంది. ఇటీవలి కాలంలో కొరియన్ సినిమాలు, వెబ్ సిరీస్‌లకు తెలుగు ప్రేక్షకుల్లో పెరిగిన ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఈ నేపథ్యాన్ని ఎంచుకోవడం మంచి నిర్ణయమే. దీనికి వరుణ్ తేజ్ స్క్రీన్ ప్రెజెన్స్, సత్య కామెడీ జత కావడంతో కొన్ని సన్నివేశాలు బాగా పనిచేశాయి. అయితే దర్శకుడు అసలు కథలోకి వెళ్లడానికి చాలా సమయం తీసుకున్నాడు. మొదటి ఇరవై నిమిషాలు పాత్రల పరిచయానికే పరిమితమవుతాయి. కొరియన్ ఆత్మ ఎప్పుడు హీరోలోకి వస్తుందా అనే ఆసక్తితో ప్రేక్షకుడు ఎదురుచూస్తుంటాడు. ప్రచార చిత్రాల ద్వారానే ఈ అంశం ముందుగానే తెలిసిపోవడంతో ఆ కీలక ఘట్టం కోసం మరింత ఆసక్తి పెరుగుతుంది.

కానీ ఆ సన్నివేశం చాలా ఆలస్యంగా రావడం ఫస్ట్ హాఫ్‌ను కొంత నెమ్మదిగా మార్చేస్తుంది. ఈ గ్యాప్‌ను సత్య కామెడీ, హీరో-హీరోయిన్ ప్రేమకథతో నింపాలని దర్శకుడు ప్రయత్నించాడు. సత్య కామెడీ చాలా వరకు వర్కవుట్ అయినా.. లవ్ ట్రాక్ మాత్రం పూర్తిగా రొటీన్‌గా అనిపిస్తుంది. హీరో కుటుంబానికి సంబంధించిన సన్నివేశాలు, సునీల్ విలన్ ట్రాక్ కూడా పెద్దగా ప్రభావం చూపవు. హీరో శరీరంలోకి ఆత్మ ప్రవేశించిన తర్వాత మాత్రం కథకు కొంత వేగం వస్తుంది. ముఖ్యంగా సత్య బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్ వల్ల కొన్ని సన్నివేశాలు మంచి వినోదాన్ని అందిస్తాయి. కుక్కపిల్ల ఎపిసోడ్, స్మశానం సన్నివేశాలు ఫస్ట్ హాఫ్‌లో బాగా నవ్వించే భాగాలుగా నిలుస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో అసలు ఆత్మ కథ బయటపడటం సెకండ్ హాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది.

Korean Kanakaraju Movie Review సెకండ్ హాఫ్‌లో తగ్గిన పట్టుదల.. సత్య ఒక్కరే భుజాన వేసుకున్న వినోదం

కథలో అసలు బలం ఉండాల్సిన సెకండ్ హాఫ్‌లో దర్శకుడు పట్టు కోల్పోయాడు. సన్నివేశాలు చాలా సాధారణంగా సాగిపోతాయి. పెద్దగా సంఘర్షణ కనిపించదు. దర్శకుడు కాన్‌ఫ్లిక్ట్ సృష్టించాలని ప్రయత్నించినా అది సరిపోదు. ఈ సినిమా పేరు చూసి హారర్ అనుకుని థియేటర్‌కు వెళ్లిన వారికి కొంత నిరాశ కలగొచ్చు. ఎందుకంటే ఇందులో భయపెట్టే హారర్ ఎలిమెంట్స్ దాదాపు కనిపించవు. దర్శకుడు మొదటి నుంచి చివరి వరకు కామెడీపైనే ఎక్కువగా ఆధారపడ్డాడు. హీరోలోకి ఆత్మ ప్రవేశించే వరకు కథలో వినోదం బాగానే ఉంటుంది. కానీ ఆ తర్వాత కథ సీరియస్ మోడ్‌లోకి వెళ్లినా భావోద్వేగ బలం కనిపించదు. బుల్లిరాజు ఎపిసోడ్ కూడా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేదు. ఇలాంటి సమయంలో మరోసారి సినిమా బాధ్యత మొత్తం సత్య భుజాలపై పడుతుంది. కనకరాజు ఆత్మను పిలిపించే ప్రయత్నంలో వచ్చే కామెడీ ఎపిసోడ్ ప్రేక్షకులను బాగా నవ్విస్తుంది. ముఖ్యంగా సిగ్నల్ లేక వీడియో కాల్ కట్ అవుతూ జరిగే సంఘటనలు థియేటర్‌లో మంచి నవ్వులు పంచుతాయి. సెకండ్ హాఫ్‌లో గుర్తుండిపోయే కామెడీ ట్రాక్ ఇదే.

ప్రీ క్లైమాక్స్‌లో అన్నయ్య సెంటిమెంట్‌ను మళ్లీ తెరపైకి తీసుకురావాలని ప్రయత్నించినా అది సహజంగా అనిపించదు. ఫ్లాష్‌బ్యాక్ కూడా బలవంతంగా జోడించినట్లే ఉంటుంది. క్లైమాక్స్‌లో రెండు ఆత్మల మధ్య పోరాటం అనే ఆలోచన బాగున్నా.. దాని విజువల్ ఎగ్జిక్యూషన్ మాత్రం అంతగా మెప్పించదు. బడ్జెట్ లేదా సమయ పరిమితుల కారణంగా కొన్ని భాగాలను త్వరగా ముగించినట్లు అనిపిస్తుంది. చివరికి క్లైమాక్స్ ఫైట్ వీడియో గేమ్ తరహా ఫీలింగ్ ఇస్తుంది.  అయితే పార్ట్-2కు ఇచ్చిన లీడ్ మాత్రం ఆసక్తిని కలిగిస్తుంది. ఆ సన్నివేశంలో వరుణ్ తేజ్ కొత్త గెటప్, స్టైలింగ్ ఆకట్టుకుంటాయి.

వరుణ్ తేజ్, సత్య నటన ఎలా ఉంది?

కనకరాజు పాత్రలో వరుణ్ తేజ్ తనవంతు న్యాయం చేశాడు. రాయలసీమ మాస్ లుక్‌తో పాటు కొరియా గ్యాంగ్‌స్టర్ అవతార్‌లో కూడా బాగా ఒదిగిపోయాడు. స్థానిక యాసను బాగా పలికించాడు. కామెడీ టైమింగ్ కూడా సహజంగా అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత అతనికి డ్యాన్స్ చేసే అవకాశం కూడా లభించింది. రితికా నాయక్ పాత్ర కేవలం పాటలకే పరిమితం కాదు. సినిమా మొత్తం హీరోతో పాటు ప్రయాణిస్తుంది. అయితే ఇద్దరి మధ్య ప్రేమ సన్నివేశాలు మాత్రం ఆశించిన స్థాయిలో పండలేదు. మురళీధర్ గౌడ్ తన పాత్రలో ఓకే అనిపిస్తాడు. కానీ ఈ సినిమాకు అసలైన బలం మాత్రం సత్యే. మొదటి నుంచి చివరి వరకు అతని కామెడీ టైమింగ్ సినిమాను నిలబెడుతుంది. అవకాశం ఉన్నా లేకపోయినా ప్రేక్షకులను నవ్వించడానికి ప్రయత్నించాడు. ముఖ్యంగా బాలకృష్ణ, సీనియర్ ఎన్టీఆర్ మేనరిజంలను అనుకరించిన సన్నివేశానికి థియేటర్‌లో మంచి స్పందన వస్తుంది.

టెక్నికల్ అంశాలు ఎలా ఉన్నాయి?

కొరియా నేపథ్యాన్ని ఎంచుకోవడం దర్శకుడి మంచి ఆలోచన. కానీ అంత మంచి కాన్సెప్ట్‌ను చివరికి సాధారణ కమర్షియల్ ట్రాక్‌లోకి తీసుకురావడం కొంత నిరాశ కలిగిస్తుంది. హారర్ అంశాలను పూర్తిగా పక్కన పెట్టి కామెడీపైనే ఆధారపడటం వల్ల సినిమా ఒకే రకమైన టోన్‌లో సాగుతుంది. కొన్ని చోట్ల కామెడీ బాగా పేలినా మరికొన్ని చోట్ల ఆశించిన ఫలితం ఇవ్వదు. ముఖ్యంగా కొరియాలో జరిగే సన్నివేశాలపై మరింత శ్రద్ధ పెట్టి ఉంటే కథకు కొత్త అనుభూతి వచ్చేది. క్లైమాక్స్ విజువల్‌గా కూడా మరింత గ్రాండ్‌గా తీర్చిదిద్దే అవకాశం ఉంది. తమన్ అందించిన పాటల్లో ‘కంసామీన’ పాట ఆకట్టుకుంటుంది. చిత్రీకరణ కూడా బాగుంది. మిగిలిన పాటలు అంతగా గుర్తుండవు. నేపథ్య సంగీతంతో కొన్ని సన్నివేశాలకు ఉత్సాహం తీసుకురావడానికి ప్రయత్నించాడు. అయితే కొరియా ఎపిసోడ్‌లలో వినిపించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని సందర్భాల్లో ‘ఓజీ’ని గుర్తు చేస్తుంది. ఎడిటింగ్ కచ్చితంగా ఉంది. నిర్మాణ విలువలు కూడా మంచి స్థాయిలో కనిపిస్తాయి. స్క్రిప్ట్‌పై ఇంకాస్త దృష్టి పెట్టి, బలమైన ట్విస్టులు జోడించి, స్క్రీన్‌ప్లేను మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దినట్లయితే ఈ సినిమా మరో స్థాయికి వెళ్లేది.

ఫైనల్ వెర్డిక్ట్

‘కొరియన్ కనకరాజు’ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన హారర్ కామెడీ. కానీ హారర్ కంటే కామెడీకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. ఆ కామెడీలో కూడా ఎక్కువ భాగం సత్య భుజాలపై నడుస్తుంది. వరుణ్ తేజ్ తన పాత్రలో మెప్పించినా, కథలో బలమైన ట్విస్టులు లేకపోవడం, సెకండ్ హాఫ్ బలహీనంగా మారడం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లలేదు. అయినప్పటికీ టైమ్‌పాస్ ఎంటర్‌టైనర్‌గా మాత్రం నిరాశపరచదు. టికెట్ ధరకు తగ్గ వినోదం అందించే సినిమా అని చెప్పొచ్చు.

Korean Kanakaraju Movie Review : ట్విట్టర్ టాక్ ఎలా ఉంది? వరుణ్ నటన, సత్య కామెడీకి ప్రశంసలు

ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకుల అభిప్రాయాల ప్రకారం, సినిమా మొదటి భాగం వినోదంతో నిండిపోయిందని చెబుతున్నారు. కథలో కొరియన్ దెయ్యం కనకరాజు శరీరంలోకి ప్రవేశించిన తర్వాత సినిమా అసలు మజా మొదలవుతుందని, అక్కడి నుంచి వరుస కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తాయని సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. కనకరాజు పాత్రలో వరుణ్ తేజ్ తన బాడీ లాంగ్వేజ్, హావభావాలు, కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడని, అలాగే మాస్, పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించాడని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. మరోవైపు కమెడియన్ సత్య మరోసారి తన కామెడీ టైమింగ్‌తో సినిమాకు ప్రధాన బలంగా నిలిచాడని నెటిజన్లు పేర్కొంటున్నారు. అతడి రియాక్షన్స్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను బాగా నవ్వించాయని కామెంట్లు వస్తున్నాయి. ఇంటర్వెల్ బ్లాక్ కూడా సినిమాకు హైలైట్‌గా నిలిచిందని, ముఖ్యంగా ఆ సన్నివేశానికి ఎస్. థమన్ అందించిన పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుల్లో మంచి హైప్‌ను క్రియేట్ చేసిందని ట్విట్టర్ టాక్ చెబుతోంది. కొందరు అభిమానులు ఈ బీజీఎమ్‌ను ‘OG’ తరహా ఎనర్జీతో పోలుస్తున్నారు. డైలాగ్స్ కూడా బాగా పేలాయని స్పందనలు వినిపిస్తున్నాయి.

ఒక నెటిజన్ తన అభిప్రాయాన్ని ఇలా పంచుకున్నాడు..

“ఫస్టాఫ్ మొత్తం నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్. నవ్వుల జాతరలా సాగింది. వరుణ్ తేజ్‌కు ఇది కచ్చితంగా కంబ్యాక్ మూవీ అవుతుందనే ఫీలింగ్ కలిగించింది. ఓపెనింగ్ ఫైట్ తర్వాత అనంతపురం నేపథ్యంలో వచ్చే వరుస కామెడీ సన్నివేశాలు ఎక్కడా బోర్ కొట్టనివ్వవు. సత్య తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు. రితికా నాయక్ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ఎపిసోడ్‌కు థమన్ ఇచ్చిన బీజీఎమ్ సీన్ ప్రభావాన్ని మరింత పెంచింది. ఫస్ట్ హాఫ్ మంచి హైతో ముగియడంతో సెకండాఫ్‌పై ఆసక్తి మరింత పెరిగింది.”

మరో నెటిజన్ ఇలా స్పందించాడు..

“ఫస్ట్ హాఫ్ బ్లాక్‌బస్టర్. ఇండో-కొరియన్ కాన్సెప్ట్‌తో వచ్చిన అరుదైన సినిమాల్లో ఇది ఒకటి. కామెడీ, కొరియన్ విజువల్స్, యాక్షన్ బ్లాక్స్, ఇంటర్వెల్ వరకు ఎక్కడా ఎనర్జీ తగ్గలేదు.” ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న స్పందనలన్నీ ప్రధానంగా ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకుల అభిప్రాయాలే. పూర్తి స్థాయి తీర్పు మాత్రం సాధారణ ప్రేక్షకుల స్పందన, బాక్సాఫీస్ కలెక్షన్ల తర్వాతే స్పష్టమవుతుంది. అయితే తొలి టాక్ ప్రకారం చూస్తే, ‘కొరియన్ కనకరాజు’ వరుణ్ తేజ్ కెరీర్‌లో చాలా రోజుల తర్వాత మంచి ఓపెనింగ్‌ను అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

No liveblog updates yet.

LIVE UPDATES

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp