KCR : గులాబీ దళపతి పై కార్యకర్తల గుస్సా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

KCR : గులాబీ దళపతి పై కార్యకర్తల గుస్సా..!

 Authored By aruna | The Telugu News | Updated on :21 January 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  KCR : గులాబీ దళపతి పై కార్యకర్తల గుస్సా..!

KCR : విజయం అమితానందాన్ని ఇస్తుంది. పరాజయం కష్టాన్ని కొని తెస్తుంది. గెలిచినప్పుడు విశ్లేషణలు ఎంత సులభమో ఓడినప్పుడు పోస్టుమార్టం కూడా అంతే కష్టం. ఓడిన పార్టీ నాయకుడు ప్రతి ఒక్కరికి చులకన అయిపోతాడు. అంతా నీ వల్లే అంటూ ప్రతి ఒక్కరూ వేలెత్తి చూపుతారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కూడా అదే జరుగుతుంది. లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కేటీఆర్ సహా ఇతర అగ్ర నేతల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు జిల్లాల నుంచి భారీ ఎత్తున నేతలు, కార్యకర్తలు తరలివస్తున్నారు. నేతలు చెప్పింది వినడానికి కార్యకర్తలు వస్తున్నారని సంబరపడిపోయిన వారికి ఈ సమావేశాలు పెద్ద గుణపాఠం కాబోతున్నాయి. కార్యకర్తలే ఎక్కువసేపు మాట్లాడుతూ నేతలను నిలదీస్తున్నారు.ఆస్తులు అమ్ముకొని పార్టీ కోసం త్యాగాలు చేసి ఉద్యమకారులకు దక్కిన గౌరవం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీంతో అగ్ర నేతలు నీళ్లు నములుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు వరగబెట్టింది ఏమిటని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. కార్యకర్త నిర్మాణం లేకపోవడం బీఆర్ఎస్ కి పెద్ద శాపం అయింది.

పార్టీని కేంద్రీకృత వ్యవస్థగా మార్చడంతో కింది స్థాయిలో దొరలతనం నిలిచిపోయింది. కార్యకర్తల ఆలోచనలు వారి ఇబ్బందులు అధిష్టానానికి చేరవేసే ప్రక్రియ ను బీఆర్ఎస్ నేతలు ఏనాడు పట్టించుకోలేదు. అదే పరాజయానికి కారణమైందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పైగా క్యాడర్ కూడా అదే విషయాన్ని చెబుతున్నారు. ఉద్యమ కాలంలో పదేళ్ల అధికారంలో కిందిస్థాయి వాళ్లని పట్టించుకున్న దాఖలాలు లేవు.గ్రామీణ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే ప్రక్రియ ఏనాడు చేపట్టలేదు. నిత్యం భావోద్వేగాలను రెచ్చగొట్టే పబ్బం గడుపుకోవాలని ప్రయత్నం పార్టీ పెద్దల్లో కనిపించింది. ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు అందిన కాడికి పుచ్చుకోవడం తప్ప క్యాడర్ను దగ్గరకు తీసుకొని వారి ఆలోచనలకు గౌరవం ఇవ్వటం లాంటి చర్యలు చేపట్టలేదు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు స్థాయి సన్నాహాలు సమావేశాల్లో ఇలాంటి అంశాలపైనే నేతలను కార్యకర్తలు నిలదీస్తున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ కార్యకర్తకు అయిన న్యాయం చేశారా అని ప్రశ్నిస్తున్నారు. పదవుల కోసం పరిగెత్తుకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ లోకి చేరుతున్నారు.

మున్సిపాలిటీల అవిశ్వాస తీర్మానాలను గుర్తు చేస్తున్నారు.గ్రామస్థాయిలో పార్టీని పటిష్టం చేయాలని కమిటీలు వేయాలని పనిచేసే వారికి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. క్యాడర్ మేము ఉన్నామని భరోసా ఇస్తే పార్టీ పటిష్టం అవుతుందని లీడర్లు, కార్యకర్తల మధ్య గ్యాప్ ను తొలగించాలని కోరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగి నెల రోజులు దాటిన బీఆర్ఎస్ తీరు మారలేదని కార్యకర్తలు నిలదీస్తున్నారు. కార్యకర్తల గోడును అధిష్టానం పట్టించుకుంటుందా అంటే అది పెద్ద ప్రశ్న అవుతుంది. ఈసారి అందరికీ ప్రాధాన్యత ఇవ్వకపోతే నేలకు దిగిన పార్టీ లేసి నిల్చోడం చాలా కష్టం. ఏ నిర్ణయమైనా కేసీఆర్, కేటీఆర్ చేతుల్లోనే ఉంది.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది