Revanth Reddy : గుడ్‌న్యూస్‌.. మరో రెండు గ్యారంటీలు అమ‌లుకు రంగం సిద్ధం.. ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Revanth Reddy : గుడ్‌న్యూస్‌.. మరో రెండు గ్యారంటీలు అమ‌లుకు రంగం సిద్ధం.. !

Revanth Reddy : ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల్లో మరో రెండు గ్యారంటీలను అమలు చేద్దామని ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి Revanth Reddy  అన్నారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ లబ్ధి జరిగేలా గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. మరో రెండు గ్యారంటీల అమలుకు సన్నాహాలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన దరఖాస్తులపై ఈరోజు డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కేబినేట్ సబ్ కమిటీ మంత్రులు, ఉన్నతాధికారులతో […]

 Authored By aruna | The Telugu News | Updated on :1 February 2024,11:18 pm

ప్రధానాంశాలు:

  •  ఈ బడ్జెట్లోనే వాటికి నిధుల కేటాయింపు

  •  ఒక్క అర్హుడికి నష్టం జరగకుండా చూడాలి

  •  ప్రజా పాలన దరఖాస్తుల సమీక్షలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి

Revanth Reddy : ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల్లో మరో రెండు గ్యారంటీలను అమలు చేద్దామని ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి Revanth Reddy  అన్నారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ లబ్ధి జరిగేలా గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. మరో రెండు గ్యారంటీల అమలుకు సన్నాహాలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన దరఖాస్తులపై ఈరోజు డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కేబినేట్ సబ్ కమిటీ మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి Ponguleti Sriniva Reddy  ఈ సమావేశంలో ఉన్నారు.రూ.500కు గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకాలపై సంబంధిత విభాగాల అధికారులతో చర్చించారు. ఈ మూడు గ్యారంటీల అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వీటిలో రెండింటిని తక్షణమే అమలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం చెప్పారు. ఒక్కో గ్యారంటీ అమలుకు ఎంత ఖర్చవుతుంది.. ఎంత మందికి లబ్ధి కలుగుతుందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ బడ్జెట్ లోనే వాటికి అవసరమైన నిధులు కేటాయించాలని సీఎం ఆర్థిక శాఖకు సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లోపు మరోసారి కేబినేట్ సబ్ కమిటీతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

అర్హులందరికీ లబ్ధి చేకూరేలా పథకాల అమలు

రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టారు. ఇందులో ప్రభుత్వం ప్రకటించిన అయిదు గ్యారంటీలకు అర్హులైన వారందరి నుంచి గ్రామసభలు, వార్డు సభల ద్వారా దరఖాస్తులను స్వీకరించారు. అయిదు గ్యారంటీలకు మొత్తం 1,09,01,255 దరఖాస్తులు నమోదయ్యాయి. జనవరి 12వ తేదీ నాటికే వీటికి సంబంధించిన డేటా ఎంట్రీ రికార్డు సమయంలో పూర్తి చేసినట్లు అధికారులు సీఎంకు నివేదించారు.వచ్చిన దరఖాస్తుల్లో కొందరు ఒకే పేరుతో రెండు మూడు దరఖాస్తులు ఇచ్చారని, కొన్నింటికి ఆధార్, రేషన్ కార్డు నెంబర్లు లేవని అధికారులు వివరించారు. అలాంటి దరఖాస్తులను మరోసారి పరిశీలించాలని, అవసరమైతే క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన జరపాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అర్హులైన వారెవరూ నష్టపోకుండా ఒకటికి రెండు సార్లు సరి చూడాలని కోరారు. దరఖాస్తుల్లో తప్పులుంటే వాటిని సరిదిద్దుకునేందుకు ఎంపీడీవో ఆఫీసుల్లో లేదా తదుపరి నిర్వహించే ప్రజా పాలన కార్యక్రమంలో మరోసారి అవకాశమిచ్చే ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు.

గ్యారంటీల అమలుకు లేని పోని నిబంధనలు పెట్టి ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దని చెప్పారు. దరఖాస్తు చేసిన వారిలో అర్హులైన వారందరూ లబ్ధి పొందేలా చూడాలని అన్నారు. దరఖాస్తు చేయని వారుంటే.. నిరంతర ప్రక్రియగా మళ్లీ దరఖాస్తు చేసే అవకాశం కల్పించాలని సీఎం ఆదేశించారు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, డిజిపి శ్రీ రవిగుప్తా, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణా రావు, సివిల్ సప్లయిస్ కమిషనర్ శ్రీ డీఎస్ చౌహన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి శ్రీ దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ శ్రీ రోనాల్డ్ రోస్, హోం శాఖ కార్యదర్శి శ్రీ జితేందర్, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీ శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి శ్రీ అజిత్ రెడ్డి, ఇంటలిజెన్స్ చీఫ్ శ్రీ శివధర్ రెడ్డి, ఇతర ఉన్నాతాధికారులు పాల్గొన్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది