Komatireddy : ఎమ్మెల్యేగా పోటీ చేయను.. కోమటిరెడ్డి సంచలనం?
Komatireddy : తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సమాయాత్తం అవుతున్నాయి. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ మూడు పార్టీలు ఎన్నికలకు సమాయాత్తం అవుతున్నాయి. ఈనేపథ్యంలో పార్టీల మధ్య గొడవలు, మాటల యుద్ధం అనేది సహజం. ప్రస్తుతం అదే జరుగుతోంది. ఒక పార్టీని మరొక పార్టీ నిందించడం స్టార్ట్ అయింది. అధికార బీఆర్ఎస్.. కాంగ్రెస్ పై… కాంగ్రెస్ పార్టీ నేతలు.. బీఆర్ఎస్ పై విరుచుకుపడుతున్నారు. తాజాగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా అధికార బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటలు కరెంట్ ఇస్తే తాను ఎమ్మెల్యేగా పోటీ చేయబోనని స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. తన సవాల్ ను గులాబీ పార్టీలో ఎవరు స్వీకరిస్తారో రావాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ అంటేనే బొందల రాష్ట్ర సమితి.. అని కోమటిరెడ్డి విమర్శించారు.
తమ పార్టీ గురించి పక్కన పెట్టి అగ్గిపెట్టె హరీశ్ తన పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఆరు అడుగులు పెరగడం కాదు.. కొంచెం బుర్ర పెట్టి ఆలోచించాలని మంత్రి హరీశ్ రావును ఉద్దేశించి అన్నారు. కర్ణాటకలో అమలు అవుతున్న స్కీమ్ లను తనతో బీఆర్ఎస్ నేతలు వస్తే తీసుకెళ్లి చూపిస్తానని కోమటిరెడ్డి తెలిపారు. స్పెషల్ విమానాలు పెట్టి మంత్రులను తీసుకెళ్తా. తెలంగాణలో కరెంట్ సమస్య తీవ్రంగా ఉంది. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఉన్నా లేనట్టే. ఆయనకు సబ్జెక్ట్ లేదు. సీఎం కేసీఆర్ వైరల్ ఫీవర్ నుంచి కోలుకోవాలి. సీఎం జ్వరంతో ఉంటే కేటీఆర్, హరీశ్ ఎందుకు సమీక్ష చేయడం లేదు.. అంటూ విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లు 10 కోట్లకు టికెట్లను అమ్ముకుంటున్నారంటూ హరీశ్ రావు పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు. టీఎస్పీఎస్సీ పూర్తిగా వైఫల్యం చెందింది. పరీక్ష నిర్వహణ చేతకావడం లేదు. కాంగ్రెస్ వచ్చాక పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు.
Komatireddy : కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలు 100 రోజుల్లో నెరవేరుస్తాం
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలను 100 రోజుల్లో నెరవేరుస్తాం. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మాలాంటి వాళ్లం ప్రభుత్వం నుంచి వెళ్లిపోతాం. కేసీఆర్ లాగా మేము దుబారా ఖర్చులు చేయం. జార్ఖండ్ లాంటి రాష్ట్రంలో కూడా ఒకటో తారీఖున జీతాలు పడుతుంటే తెలంగాణలో ఉద్యోగుల జీతాలు 15న ఇస్తున్నారు. ధనిక రాష్ట్రం తెలంగాణలో 16 నెలల నుంచి జీతాలు ఒకటో తారీఖున పడటం లేదు.. అంటూ దుయ్యబట్టారు.