Rythu Bharosa : అన్నదాతలకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. దసరాకు రైతు భరోసా
ప్రధానాంశాలు:
Rythu Bharosa : అన్నదాతలకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. దసరాకు రైతు భరోసా
Rythu Bharosa : తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు తీపి కబురు అందించేందుకు సిద్ధమైంది. అన్నదాతలు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీల్లో రైతు భరోసా పథకం ఒకటి. ఈ పథకం కింద పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.15 వేలు అందనున్నాయి. వానకాలం, యాసంగి రెండు సీజన్లకు కలిపి ఎకరాకు రూ.7,500 చొప్పున మెుత్తం రూ. 15 వేలు పంట పెట్టుబడి సాయం కింద రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ మేరకు రైతు భరోసా పథకం అమలుకు ముహూర్తం ఖరారు అయినట్లు సమాచారం. దసరా పండుగ (అక్టోబర్ 12) నుంచి రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.
ఇందుకు అవసరమైన నిధులు సిద్ధం చేయాలని ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశించారు. వచ్చే నెల తొలివారంలో పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఆ వెంటనే విడుతల వారీగా పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ. 7,500 రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం మాదరిగా కాకుండా ఈసారి సాగులో ఉన్న భూములకే రైతు భరోసా ఇచ్చేలా ప్రభుత్వం మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ విషయంలో ఇప్పటికే కీలక ప్రకటన చేశారు. రియల్ ఎస్టేట్ భూములు, కొండలు, గుట్టలకు రైతు భరోసా ఇవ్వబోమని తేల్చి చెప్పారు.
సాగులో ఉన్న భూములకే రైతు భరోసా పథకం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే పెట్టుబడి సాయాన్ని 10 ఎకరాలకు పరిమితం చేయాలనే ప్రతిపాదనలు వచ్చాయి. దీనిపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈసారి బడ్జెట్లో రైతు భరోసా పథకం అమలు కోసం ప్రభుత్వం రూ.15 వేల కోట్లు కేటాయించింది. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం ఈ వానాకాలం సీజన్‌లో 1.39 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. మొత్తం సాగైన భూములకు ఎకరాకు రూ.7,500 చొప్పున రైతు భరోసా డబ్బులు ఇస్తే దాదాపు రూ.10 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ అంచనా.