Telangana Congress : ముగిసిన సీఎల్పీ భేటీ.. సీఎం ఎవరో నిర్ణయించారా? ప్రమాణ స్వీకారం ఎప్పుడు?
ప్రధానాంశాలు:
గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ లో సీఎల్పీ సమావేశం
సీఎల్పీకి 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరు
సీఎల్పీ నేత ఎంపిక అధిష్ఠానానికే అప్పగింత
Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం ముగిసింది. ఇవాళ ఉదయం నుంచి సీఎల్పీ మీటింగ్ ఎప్పుడు జరుగుతుందా అని రాష్ట్రమంతా ఎదురు చూస్తోంది. నిజానికి నిన్న రాత్రే సీఎల్పీ మీటింగ్ జరగాలి కానీ.. వాయిదా పడింది. తాజాగా ఇవాళ గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ లో ఈ సమావేశాన్ని నిర్వహించారు. దాదాపు 40 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వీళ్లంతా కలిసి సీఎల్పీ నేతను ఎన్నుకుంటారని అంతా భావించారు. కానీ.. సీఎల్పీ నేతను ఎంపిక చేసే బాధ్యతను అధిష్ఠానానికే వదిలేశామని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. సీఎల్పీ నేత ఎవరు అనేది కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నిర్ణయిస్తారని డీకే స్పష్టం చేశారు. అయితే.. సీఎల్పీ నేత ఎవరు అనే దానిపై ఏఐసీసీ కూడా ఇవాళే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
సీఎల్పీ తీర్మానాన్ని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టగా, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పది మంది ఎమ్మెల్యేలు పీసీసీ చీఫ్ తీర్మానాన్ని బలపరిచారు. సీఎల్పీ నేత ఎంపికను అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానించారు. అయితే.. సీఎల్పీ నేతను ఎన్నుకోగానే వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాసేపట్లోనే గవర్నర్ ను కాంగ్రెస్ నేతలు కలవనున్నారు. అంతకుముందే తెలంగాణ ఎన్నికల అధికారి వికాస్ రాజ్.. రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు గెలిచిన 119 ఎమ్మెల్యేల లిస్టును అందజేయనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీకి గవర్నర్ గెజిట్ విడుదల చేయనున్నారు. ఇప్పటికే రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాటు జరుగుతున్నాయి. సాయంత్రం 5 గంటలకు సీఎం, డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారం జరగనుంది. దీంతో రాజ్ భవన్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే.. కేవలం సీఎం, డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారాలే ఉంటాయా లేక మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా ఉంటుందా అనేది ఇంకా తెలియదు.
Telangana Congress : కాంగ్రెస్ ముఖ్య నేతలతో డీకే భేటీ
అయితే.. సీఎల్పీ సమావేశానికి ముందే.. డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. పార్క్ హయత్ హోటల్ లో ఆయన భేటీ అయ్యారు. భట్టి విక్రమార్క, ఉత్తమ్, శ్రీధర్ బాబు, రాజనర్సింహ, కోమటిరెడ్డితో భేటీ అయ్యారు. ప్రభుత్వం ఏర్పాటు విషయమై వాళ్లతో ఆయన చర్చించారు. అయితే.. సీఎం పదవి కోసం ముగ్గురు సీనియర్ నేతలు అధిష్ఠానంతో టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క, మరో సీనియర్ నేత సీఎం రేసులో ఉన్నట్టు తెలుస్తోంది.