Revanth Reddy : రేవంత్ వల్ల కావడం లేదా ? CM ఉక్కిరిబిక్కిరి..!
Revanth Reddy తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు రోజురోజుకూ మరింత బహిర్గతమవుతున్నాయా? ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, చిన్నారెడ్డి వంటి నేతలు వివిధ సందర్భాల్లో పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయగా.
Revanth Reddy : తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు రోజురోజుకూ మరింత బహిర్గతమవుతున్నాయా? ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, చిన్నారెడ్డి వంటి నేతలు వివిధ సందర్భాల్లో పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయగా.. తాజాగా మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలను ప్రశ్నిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో మరోసారి అంతర్గత పోరును తెరపైకి తెచ్చాయి. ఎవరికి వారు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తుండటంతో కాంగ్రెస్‌లో చెప్పుకునే ‘అంతర్గత ప్రజాస్వామ్యం’ ఇప్పుడు హద్దులు దాటుతోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. రాజగోపాల్ రెడ్డి కొంతకాలంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండగా.. అనిరుధ్ రెడ్డి, ఇటీవల సీనియర్ నేత చిన్నారెడ్డి కూడా పార్టీ వ్యవహారాలపై తమ అభిప్రాయాలను బహిరంగంగానే వెల్లడించారు. ఇప్పుడు కొండా సుస్మిత కూడా ముఖ్యమంత్రినే నేరుగా టార్గెట్ చేయడంతో ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది.
Revanth Reddy : రేవంత్ వల్ల కావడం లేదా ? CM ఉక్కిరిబిక్కిరి..!
Revanth Reddy సీఎంను సైతం ప్రశ్నించిన కొండా సుస్మిత.. పరకాల టికెట్‌పై సంచలన వ్యాఖ్యలు
రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత.. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కలకలం రేపాయి. ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఇంకా పూర్తిగా వంటబట్టలేదని, పార్టీ క్రమంగా ‘టీడీపీ కాంగ్రెస్’గా మారుతోందంటూ ఆమె తీవ్ర విమర్శలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ కేడర్‌లో కూడా చర్చనీయాంశంగా మారాయి.వరంగల్ జిల్లా గీసుకొండలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన కొండా సుస్మిత.. రాబోయే ఎన్నికల్లో పరకాల అసెంబ్లీ టికెట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను తీవ్రంగా తప్పుబట్టారు. తమకు టికెట్ నిరాకరించడానికి అసలు రేవంత్ రెడ్డి ఎవరు? అని ప్రశ్నించిన ఆమె.. అభ్యర్థులకు టికెట్లు కేటాయించడం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పరిధిలోని అంశమని వ్యాఖ్యానించారు.అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోయినా.. స్వతంత్ర అభ్యర్థిగా అయినా పోటీ చేసి గెలిచి తీరుతానని సుస్మిత సవాల్ చేసినట్లు తెలిపారు. దీంతో పరకాల కాంగ్రెస్ రాజకీయాలు మరింత వేడెక్కాయి.ఇదే సమయంలో గత రాజకీయ పరిణామాలను కూడా ఆమె గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా కావాలని తొలుత కోరింది కొండా దంపతులేనని సుస్మిత పేర్కొన్నట్లు సమాచారం. అలాగే కొడంగల్‌లో రేవంత్ రెడ్డి ఓటమిని కూడా ప్రస్తావిస్తూ.. ఆ విషయాన్ని సీఎం మరిచిపోవద్దంటూ అత్యంత ఘాటైన స్వరంతో విమర్శలు చేసినట్లు తెలుస్తోంది.ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త రాజకీయ చర్చకు తెరలేపాయి. ఇప్పటికే పరకాల టికెట్ విషయంలో పరోక్షంగా పోటీ వాతావరణం కనిపిస్తుండగా.. తాజాగా సుస్మిత చేసిన వ్యాఖ్యలతో అది బహిరంగ రాజకీయ పోరుగా మారుతోందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Revanth Reddy కాంగ్రెస్‌లో అసమ్మతి నేతలు పెరుగుతున్నారా? క్రమశిక్షణ కమిటీపై ప్రశ్నలు
తాజా పరిణామాలను పరిశీలిస్తే తెలంగాణ కాంగ్రెస్‌లో అసంతృప్తి ఏ స్థాయికి చేరిందనే చర్చ మొదలైంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, చిన్నారెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి వంటి కీలక నేతలు ఇప్పటికే వేర్వేరు సందర్భాల్లో తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు. ఇప్పుడు కొండా సురేఖ కుటుంబం నుంచి నేరుగా ముఖ్యమంత్రిని ఉద్దేశించి విమర్శలు రావడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.పార్టీలోని పాత కాంగ్రెస్ నేతలు, బీసీ నాయకులకు తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా.. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే భావన ఈ వరుస అసంతృప్తికి కారణమవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితి క్రమంగా పార్టీ అంతర్గత సమన్వయంపై ప్రభావం చూపుతోందన్న చర్చ కూడా జరుగుతోంది.
మరోవైపు పీసీసీ క్రమశిక్షణా కమిటీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పరిస్థితిపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బహిరంగంగా పార్టీ సిద్ధాంతాలను, ముఖ్యమంత్రి నిర్ణయాలను ప్రశ్నిస్తున్న నేతలపై కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే భవిష్యత్తులో చర్యలు తప్పవని ఎంపీ మల్లు రవి వంటి నేతలు హెచ్చరికలు చేస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో అసమ్మతి నేతలను నియంత్రించడంలో గాంధీ భవన్ నాయకత్వం వెనుకబడిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.ఇక సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారిస్తూ పాలనను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. సొంత కేబినెట్ సహచరుల కుటుంబాల నుంచే వస్తున్న ఈ తరహా తీవ్ర విమర్శలు ప్రభుత్వ ఇమేజ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందనే విశ్లేషణలు ఉన్నాయి.
‘అంతర్గత ప్రజాస్వామ్యం’ పేరుతో సాగుతున్న ఈ బహిరంగ విమర్శలు, విభేదాలు చివరకు ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలకు రాజకీయంగా ఉపయోగపడే అంశంగా మారుతున్నాయనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. పార్టీ అధిష్టానం త్వరగా జోక్యం చేసుకుని నేతల మధ్య నెలకొన్న విభేదాలకు పరిష్కారం చూపకపోతే.. భవిష్యత్తులో ఈ అసంతృప్తి మరింత పెరిగే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.ఇప్పటికే పరకాల టికెట్ అంశం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో.. కొండా సుస్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుంది? పార్టీ నాయకత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా? లేక అంతర్గత చర్చల ద్వారా సమస్యను పరిష్కరిస్తుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాబోయే రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్‌లో ఈ పరిణామాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయన్నది రాజకీయంగా కీలకంగా మారనుంది.







