Singareni Employees : ఒక్కొక్కరి ఖాతాలోకి రూ.1.53 లక్షలు.. దసరాకు కేసీఆర్ సర్కార్ భారీ కానుక
Singareni Employees : సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. దసరా కానుకను ప్రకటించారు. ప్రతి సంవత్సరం సింగరేణి కార్మికులకు దసరా సందర్భంగా బోనస్ ఇస్తారు. ఈ సంవత్సరం సింగరేణి కార్మికులకు భారీ బోనస్ ప్రకటించారు. దీంతో సింగరేణి కార్మికులు ఎగిరి గంతేస్తున్నారు. దసరా పండుగ వేళ భారీగా బోనస్ ప్రకటించారు. ముందుగా మాటిచ్చిన ప్రకారంగా 2022- 2023 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన లాభాల్లో కార్మికులకు బోనస్ ప్రకటించారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం సింగరేణి ఎక్కువ లాభాలు ఆర్జించింది. సింగరేణి సంస్థ రికార్డు స్థాయిలో రూ.2222 కోట్ల లాభాలను ఈ సంవత్సరం ఆర్జించింది. ఇందులో 32 శాతం అంటే రూ.711 కోట్లను దసరా బోనస్ గా సింగరేణి కార్మికులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు బోనస్ నిధులను విడుదల చేశారు. ఈ బోనస్ డబ్బులు ఈ నెల 16 వ తేదీన సింగరేణి కార్మికుల అకౌంట్ లో జమ కానున్నాయి. సగటున ఒక్కో కార్మికుడి ఖాతాలో రూ.1.53 లక్షలు బోనస్ అందనున్నట్టు అధికారులు అంచనా వేశారు. పండుగ పూట పెద్ద ఎత్తున బోనస్ ప్రకటించడంతో సింగరేణి కార్మికులు పట్టలేని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే కార్మికులకు 11వ వేతన ఒప్పందానికి సంబంధించిన 23 నెలల బకాయిలను కార్మికులకు ప్రభుత్వం చెల్లించింది. సుమారు 1450 కోట్ల రూపాయలను ప్రభుత్వం పెండింగ్ బకాయిలను చెల్లించింది.
Singareni Employees : కార్మికులకు లాభాల్లో వాటాలు ఇస్తామని కేసీఆర్ ప్రకటన
మంచిర్యాల సభలో ప్రసంగించిన సీఎం కేసీఆర్ మునుపెన్నడూ లేని విధంగా కార్మికులకు లాభాల్లో వాటాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే గతంలో ఇచ్చిన వాటా కంటే ఎక్కువగా ఏకంగా 32 శాతం వాటాను ప్రకటించారు. ఈమేరకు ఈరోజు నిధులు విడుదల చేశారు. దీంతో ఈ ఏడాది సింగరేణి ముఖాల్లో రెట్టింపు సంతోషం కనిపిస్తోంది. దసరా, దీపావళి పండుగల సందర్భంగా వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం డబుల్ దమాకా ప్రకటించింది.