Telangana New DGP : రేవంత్ రెడ్డిని కలిసిన డీజీపీ అంజనీ కుమార్‌పై సస్పెన్షన్ వేటు.. కొత్త డీజీపీ ఎవరంటే?
ప్రధానాంశాలు:
తెలంగాణ డీజీపీని సస్పెండ్ చేసిన ఈసీ
రేవంత్ ను కలిశారని ఈసీ ఆగ్రహం
ఎన్నికల కోడ్ ఎలా ఉల్లంఘిస్తారంటూ నోటీసులు
Telangana New DGP : ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన విషయం తెలుసు కదా. 64 సీట్లు గెలిచి తెలంగాణలో అధికారంలోకి రాబోతోంది కాంగ్రెస్. అయితే.. కాంగ్రెస్ గెలుపు మధ్యాహ్నం వరకే కన్ఫమ్ అయిపోయింది. దీంతో గాంధీ భవన్ వద్ద, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు సంబురాలు చేసుకున్నారు. మధ్యాహ్నం వరకు కాంగ్రెస్ గెలుపు ఖాయం కాగానే.. వెంటనే తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ యాదవ్, ఐపీఎస్ ఆఫీసర్స్ మహేశ్ భగవత్, సంజయ్ కుమార్ లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసి ఆయనకు శుభాకాంక్షలు చెప్పి పుష్పగుచ్చం అందించారు.
అది ఒకరకంగా ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడమే. ఎన్నికల కోడ్ ఇంకా ముగియక ముందే.. రేవంత్ ను కలవడంపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. అందుకే తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ ను ఈసీ సస్పెండ్ చేసింది. అలాగే.. మహేశ్ భగవత్, సంజయ్ కుమార్ లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది ఈసీ. తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ సస్పెండ్ కావడంతో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రవి గుప్తాను తెలంగాణ కొత్త డీజీపీగా నియమించింది. 1990 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి రవి గుప్తా. ప్రస్తుతం ఆయన ఏసీబీ డైరెక్టర్ జనరల్ గా, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.