Chandrababu : చంద్రబాబు, జగన్ ఇద్దరూ ఒకే దారిలో.. రాష్ట్రం ఎటువైపో మరి?
Chandrababu : ఆంధప్రదేశ్‌లో రాజకీయం రోజుకో రకంగా మారిపోతున్నది. అసలు సమస్యలు పక్కకుపోయి పార్టీల మధ్య మాటల యుద్ధాలు పెరిగిపోయి అవి దాడుల వరకు చేరుకున్నాయి. మొన్నటి వరకు మాటల పర్వం కొనసాగగా ప్రస్తుతం దూషణలు, హింస పర్వానికి చేరుకుంది.టీడీపీ, వైసీపీ మధ్య విభేదాలు ప్రస్తుతం తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దాంతో మాటల యుద్ధం కాస్తా భౌతిక దాడుల వరకు చేరుకుంది. వైసీపీ కార్యకర్తలు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపైన, టీడీపీ కార్యాలయాలపై దాడులు చేశారు. అయితే, అసలు ఇలా జరగడానికి మూల కారణం నేతలు సంయమనం కోల్పోవడమేనని తెలుస్తోంది.
టీడీపీ అధికార ప్రతినిధిగా ఉండి ముఖ్యమంత్రిపైన దూషణలు చేయడం సరికాదని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొనకపోగా, తమ నేతలను వైసీపీ వారు దూషిస్తున్నారంటూ ప్రశ్నించారు. అలా పరోక్షంగా నేతల దూషణలను చంద్రబాబు సపోర్ట్ చేసినట్లు అయింది. ముఖ్యమంత్రి జగన్ సైతం ప్రతిపక్ష పార్టీ ఆఫీసులపై దాడి చేయడం గురించి తగిన స్థాయిలో స్పందించకపోవడం సరికాదనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నది. ప్రజాస్వామ్యంలో విమర్శలు ఉంటాయి కానీ ఇలా దాడులు చేయడం ఏంటనే ప్రశ్న తలెత్తుతున్నది. పట్టాభి వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి బదులుగా ఇలా భౌతికమైన దాడులకు దిగడం సమంజసం కాదని పలువురు అంటున్నారు. ఇలా దాడుల పర్వం కొనసాగితే ఏపీలో అరాచకాలు ఇంకా పెరిగిపోయే చాన్సెస్ మెండుగా ఉన్నాయి. అధికారంలో ఉన్న పార్టీ ఇలా ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలపైన దాడి చేయడం మంచి సంప్రదాయమేనా అని ఆలోచన చేసుకోవాల్సి ఉంది.
Chandrababu : ఇద్దరూ ఇద్దరే..!
అయితే, ఈ దాడుల విషయంలో అధికారి వైసీపీ, ప్రతిపక్ష వైసీపీ రెండు పార్టీలు కూడా సంయమనం పాటించాల్సిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. పోలీసులపైన ఫైర్ కావల్సిన అవసరం ఇరు పార్టీల నేతలకు లేదని చెప్తున్నారు. ఇకపోతే రాజకీయ పార్టీలు తమ పార్టీ తరఫున వాదనను, సిద్ధాంతాలను బలంగా వినిపించే, సభ్యతతో మాట్లాడనే నేతలను మాత్రమే అధికార ప్రతినిధులుగా నియమించుకోవాలని సూచిస్తున్నారు. దూషణలు చేసే వారిని, తిట్ల దండకం ఎత్తుకునే వారిని, ముఖ్యమంత్రిని సైతం తూలనాడటం చేయొద్దని ఆయా పార్టీల అధ్యక్షులు చెప్పాలని అంటున్నారు.