AP Capitals : మళ్లీ ముహుర్తం ఖరారు.. ఈసారైనా అవుతుందా..?
AP Capitals అమరావతి : ఏపీ ప్రభుత్వం తన రాజధానిని రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు విస్తరించాలనుకుంటున్న విషయం తెలిసిందే. అమరావతిలో అసెంబ్లీ, కర్నూలులో హైకోర్టు, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్‌ను ఏర్పాటు చేయాలనుకుంటుంది. అభివద్ధి వికేంద్రీకరణలో భాగంగా అన్ని ప్రాంతాలకు సమ ప్రాధాన్యం ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. కార్యనిర్వాహణ కార్యాలయం విశాఖకే ఎందుకంటే ఎయిర్‌పోర్టు, సీ పోర్టు, ఇతర మౌళిక వసతుల కల్పన ఇప్పటికే స్థిరపడి ఉండటం ఇందుకు కారణంగా వైఎస్సాఆర్‌సీపీ నేత ఒకరు తెలిపారు.
అయితే కోర్టుల్లో కేసుల వల్ల తరలింపు ప్రక్రియ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తుంది. అయినప్పటికీ మరోవైపు ట్రై – సిటీ ప్రణాళికలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రభుత్వ భవనాలను అభివృద్ధి చేయడంలో అపార అనుభవం ఉన్న న్యూఢిల్లీలోని సెంట్రల్ విస్టా ఆర్కిటెక్ట్ బిమల్ పటేల్‌కు చెందిన సంస్థను ప్రభుత్వం షార్ట్ లిస్ట్ చేసినట్లుగా రాష్ట్ర సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అమరావతిలో సేకరించిన భూమి అసెంబ్లీ భవనాలు ఏర్పాటు చేసేందుకు ఉపయోగించబడుతుందని, కర్నూలులో హైకోర్టు వస్తుందన్నారు. 2014 లో ఉమ్మడి ఏపీ విడిపోయినప్పటి నుంచి రాజధాని ఏర్పాటుకు ఎప్పటికప్పుడు బ్రేక్‌లు పడుతూ వస్తున్నాయి. అయితే డిజైన్, విజన్‌ను ఖరారు చేయడం వల్ల కొత్త రాజధాని అవకాశాలు మరింత వాస్తవంగా మారవచ్చని భావిస్తున్నారు.
కార్యనిర్వాహక రాజధానిని త్వరలో విశాఖపట్నంకు మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇటీవల మంత్రులు చేసిన వ్యాఖ్యలు దీన్నే ప్రతిబింభిస్తున్నాయి. దీంతో రాజధానిని మార్చడంపై ఊహాగానాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పూరి ఒక ప్రశ్నకు సమాధానంగా లోక్‌సభలో మాట్లాడుతూ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పేర్కొనబడిందన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ ఆమోదాన్ని ప్రతిబింబిస్తుంది. అయితే కేంద్రం వెంటనే సవరణ చేస్తూ విశాఖను రిఫరెన్స్ సిటీగా పేర్కొంది. అయినప్పటికీ మంత్రులు, ఎమ్మెల్యేల వ్యాఖ్యలతో రాజధాని మార్పు ఊహాగానాలు తారాస్థాయికి చేరాయి. గతంలోనే ప్రభుత్వ ఉన్నతాధికారులు సైతం విశాఖను సందర్శించి పలు భవనాలను పరిశీలించారు. కోర్టు కేసుల నేపథ్యంలో ఉన్నపళంగా రాజధాని తరలింపు సాధ్యం కాకపోయినా ముఖ్యమంత్రి జగన్ తన కార్యాలయాన్ని విశాఖను తరలిస్తాడని జోరుగా ప్రచారం జరుగుతోంది.