AP Cabinet Meeting : ముగిసిన ఏపీ కేబినేట్ మీటింగ్.. కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్న సీఎం జగన్
ప్రధానాంశాలు:
సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినేట్ మీటింగ్
పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం జగన్
గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీపై కూడా ఏపీ కేబినేట్ నిర్ణయం
AP Cabinet Meeting : ఏపీ కేబినేట్ భేటీ ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ మీటింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు సాగింది. ఏపీ సచివాలయంలోని బ్లాక్ కేబినేట్ సమావేశ మందిరంలో ఈ భేటీ జరిగింది. ఈ భేటీలో సీఎం జగన్ పలు కీలక అంశాలపై మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అందులో కీలకంగా తీసుకున్న నిర్ణయాల్లో ఏపీ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల పంపిణీపై కేబినేట్ లో చర్చించారు. అలాగే.. రూ.19 వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమల ఏర్పాటు, సమగ్ర కుల గణనపై కూడా సీఎం జగన్ ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఎస్ఐపీబీ ప్రతిపాదనలపై కూడా సీఎం జగన్ చర్చించారు.
ఈ మీటింగ్ లో ప్రభుత్వ శాఖలు సమర్పించిన 38 ప్రతిపాదనలపై కేబినేట్ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత కొన్ని ప్రతిపాదనలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న 6,790 ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్యాభివృద్ధి కోసం కేంద్రాల ఏర్పాటుకు కేబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే.. కులగణన, సామాజిక, ఆర్థిక అంశాల విషయంలో కూడా గణన చేపట్టేందుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. ఇక.. పోలవరం నిర్వాసితులకు ఇండ్ల పట్టాలు, స్థలాల రిజిస్ట్రేషన్ కు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ చార్జీల మినహాయింపు విషయంలోనూ మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఇక.. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీల విషయంలో సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే.. ట్రిపుల్ ఐటీ ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి కేబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే.. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీపై కూడా ఏపీ కేబినేట్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.