AP Politics : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ చిత్ర విచిత్రాలు – మొత్తం నడిపించేది ఎవరు?
AP Politics: ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ వైసీపీ. కానీ.. ఏపీలోని పార్టీలన్నీ బీజేపీ అంటే భయపడిపోతున్నాయి. వణికపోతున్నాయి.. దానికి కారణాలు అనేకం కానీ.. చివరకు అధికార పార్టీని కూడా పట్టించుకోని పార్టీలు బీజేపీ అంటే మాత్రం ఎందుకు భయపడుతున్నాయి అనే దానిపై క్లారిటీ తెచ్చుకోవాల్సి ఉంది. దానికి కారణాలు చాలా ఉన్నాయి. కేంద్రంతో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ. అందుకే ఏపీలో బీజేపీ పార్టీ విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేకపోతున్నాయి పార్టీలు. చివరకు అధికార వైసీపీ కూడా బీజేపీని పల్లెత్తు మాట అనలేదు. ప్రతిపక్ష పార్టీ టీడీపీ కూడా అదే దారిలో వెళ్తోంది.
ఇక.. వైసీపీ, టీడీపీతో పాటు జనసేన, కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీలు బీజేపీ వైపు చూడటం లేదు. పల్లెత్తు మాట అనడం లేదు. ఏం మాట్లాడినా ఆయా పార్టీల మధ్యనే కానీ.. బీజేపీ జోలికి మాత్రం వెళ్లడం లేదు. ప్రస్తుతం దేశమంతా మణిపూర్ అంశం అట్టుడుకుతోంది. మణిపూర్ వ్యవహారం పార్లమెంట్ లోనూ దుమ్మురేపుతోంది. మణిపూర్ ఘటనపై కేంద్రం నోరు మెదపడం లేదు. దీంతో ప్రతిపక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి. బీజేపీని ఏకిపారేస్తున్నాయి. కానీ.. ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కావచ్చు.. అధికార పార్టీ కావచ్చు.. ఏవి కూడా ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. బీజేపీని విమర్శించడం లేదు.మణిపూర్ వ్యవహారంపై వైసీపీ, టీడీపీ, జనసేన ఏ పార్టీలు కూడా నోరు మెదపడం లేదు. కనీసం మణిపూర్ ఘటనను ఖండించలేదు కూడా. పొద్దున లేస్తే అధికార వైసీపీ పార్టీపై దుమ్మెత్తిపోసే పవన్ కళ్యాణ్ కూడా అసలు నోరు మెదపడం లేదు. సరే.. జనసేన పార్టీకి అంటే బీజేపీతో పొత్తు ఉంది. మరి వైసీపీ పార్టీకి ఏమైంది.. టీడీపీ పార్టీకి ఏమైంది.
AP Politics : నోరు మెదపని జనసేన, టీడీపీ, వైసీపీ
ఆ పార్టీలు ఎందుకు మణిపూర్ ఘటనపై మాట్లాడటం లేదంటూ ఏపీ ప్రజలు మండిపడుతున్నారు. పార్లమెంట్ లో ఈ అంశంపై చర్చ జరుగుతుంటే వైసీపీ, టీడీపీకి చెందిన ఎంపీలు అయితే తమకు ఏం సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ.. బీజేపీతో వచ్చే ఎన్నికల్లో జత కట్టాలని భావిస్తోంది. అందుకే ఈ విషయంపై స్పందించడం లేదు. ఇక.. అధికార వైసీపీ కూడా బీజేపీ సత్సంబంధాలు కొనసాగించాలని అనుకుంటోంది. అందుకే నోరు మెదపడం లేదు. ఏది ఏమైనా.. మణిపూర్ అంశంపై ప్రధాన పార్టీలు స్పందించకపోవడం అనేది కరెక్ట్ కాదంటూ ఏపీ ప్రజలు మండిపడుతున్నారు.