BJP : టీడీపీ, జనసేనతో మళ్ళీ కలవనున్న బీజేపీ.?
BJP :2014 ఎన్నికల నాటి కాంబినేషన్ రిపీట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలుగుదేశం పార్టీతోనూ అలాగే జనసేన పార్టీతోనూ కలిసి నడవాలని బీజేపీ అనుకుంటోందట. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం యోచిస్తోందన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతోన్న ప్రచారం. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ, ఉమ్మడి ఖమ్మం జిల్లా అలాగే గ్రేటర్ పరిధిలో తమ బలాబలాల్ని అంచనా వేసుకుంటోంది. ఈ క్రమంలో టీడీపీ గనుక తమతో కలిస్తే, అది అదనపు అడ్వాంటేజ్ అవుతుందన్న ఆలోచనతో బీజేపీ అధిష్టానం వున్నట్లు సమాచారం. అదే సమయంలో జనసేన కూడా కలిస్తే అది తమకు మరింత లాభం చేకూర్చుతుందని బీజేపీ భావిస్తోందట.
అప్పట్లో చేతకానిది ఇప్పట్లో అవుతుందా.? అన్న కోణంలోనూ ఓ క్రాస్ చెక్ అయితే బీజేపీలో ఖర్చితంగా జరుగుతుంది. కాగా, అప్పటికీ ఇప్పటికీ సమీకరణాలు చాలా మారాయనీ, తెలంగాణలో అప్పట్లో టీడీపీ, బీజేపీ కంటే బలంగా వుండేదనీ, జనసేన అసలు పోటీనే చేయలేదనీ, ఇప్పుడు మారిన సమీకరణాల నేపథ్యంలో బీజేపీ మెయిన్ పార్టీగా వుంటే, టీడీపీ అలాగే జనసేన.. నామ మాత్రంగా పోటీలో వుంటాయని కమల నాథులు అంచనా వేస్తున్నారట. కాగా, బీజేపీతో కలవడం వల్ల తమకూ లాభమేనని తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నారని సమాచారం. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఊపిరి దాదాపు ఆగిపోతున్న ప్రస్తుత తరుణంలో బీజేపీ రూపంలో ఆక్సిజన్ అందితే చంద్రబాబు కాదనగలరా.?
ఓ ఏడెనిమిది సీట్లలో అయినా తాము గెలిచే అవకాశం వుంటుందని, ఆ దిశగా బీజేపీతో మైత్రి లాభం చేకూరుతుందని చంద్రబాబు అనుకుంటున్నారట. మరి, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి.? అంటే, అక్కడ కూడా బీజేపీ – టీడీపీ – జనసైన మైత్రి కుదిరే అవకాశం వుంది. అన్ని విషయాలపైనా త్వరలోనే ఓ స్పష్టత రాబోతోందట. గత కొంతకాలంగా బీజేపీ మీద టీడీపీ విమర్శల తీవ్రత చాలావరకు తగ్గిపోయిన సంగతి తెలిసిందే.