Breaking News : చంద్రబాబుకు మరోసారి చుక్కెదురు.. బెయిల్ పిటిషన్ వాయిదా
Chandrababu Bail Petition : టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై తాజాగా విచారణ జరిగింది. ఆ విచారణ అనంతరం ఆయన బెయిల్ పిటిషన్ ను వాయిదా వేశారు. ఈనెల 17న మళ్లీ విచారిస్తామని.. అప్పటి వరకు వాయిదా వేస్తున్నట్టు ఏపీ హైకోర్టు ప్రకటించింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో బెయిల్ ఇవ్వాలని, తనను అక్రమంగా అరెస్ట్ చేశారని చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై పలు దఫాలుగా విచారణ చేసిన ఏపీ హైకోర్టు బెయిల్ పిటిషన్ ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. అయితే.. అంతకుముందే ఏసీబీ కోర్టులో చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో బెయిల్ కావాలని పిటిషన్ వేసినా.. ఏసీబీ కోర్టు ఆ పిటిషన్ ను కొట్టేసింది. దీంతో చంద్రబాబు ఏసీబీ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు.
దానిపై తాజాగా ఏపీ హైకోర్టులో వాదనలు జరగగా.. చంద్రబాబు తరుపున సీనియర్ లాయర్స్ దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు వాదించారు. అలాగే.. ఏపీ సీఐడీ తరుపున ఏజీ శ్రీరామ్ సుబ్రహ్మణం వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. ఈకేసులో కౌంటర్ దాఖలు చేయాలంటూ సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో తదుపరి విచారణను ఈనెల 17కి వాయిదా వేస్తున్నట్టు ఏపీ హైకోర్టు ప్రకటించింది.
ఇక.. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకొని ఏసీబీ కోర్టులో హాజరుపర్చగా ఆయనకు ముందు 14 రోజుల రిమాండ్ ను కోర్టు విధించింది. దీంతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. 14 రోజుల రిమాండ్ ముగిశాక.. మళ్లీ మరో 11 రోజులు రిమాండ్ ను పొడిగించారు. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులోనే ఉన్నారు. సీఐడీ అధికారులు కూడా అక్కడే విచారణ చేస్తున్నారు. కానీ.. చంద్రబాబు మాత్రం స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో ఎలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం లేదు.