Current Charges : ఏపీ ప్రజలకు చంద్రబాబు గుడ్ న్యూస్..కరెంట్ చార్జీలు తగ్గిస్తామని హామీ
Current Charges Will Be Reduced : ఆంధ్రప్రదేశ్‌ను పేదరికం లేని రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళగిరిలో “పీ-4” (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్, పార్టనర్‌షిప్) కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న 10 శాతం ధనికులు, ఆర్థికంగా వెనుకబడిన 20 శాతం పేద కుటుంబాలకు (బంగారు కుటుంబాలు) సహాయం అందిస్తారు. ఈ కార్యక్రమం మార్చి 30, 2025న లాంఛనంగా ప్రారంభం కాగా, సుమారు 1.40 లక్షల మంది పారిశ్రామికవేత్తలు, ప్రవాసాంధ్రులు మార్గదర్శకులుగా ముందుకు వచ్చారు. ఈ విధానంలో ప్రభుత్వం కేవలం ఒక వేదికగా వ్యవహరిస్తుంది, దాతలు నేరుగా పేదలకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ పథకం ద్వారా 13 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించారు, వారి అవసరాలను గుర్తించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం.

#image_title
సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. దానధర్మాలు మన సంస్కృతిలో భాగమని, గతంలో డొక్కా సీతమ్మ వంటి వారు అన్నదానం చేసి చరిత్రలో నిలిచిపోయారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆర్థిక సంస్కరణల వల్ల సంపద సృష్టించడం సులభమైందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాలను ప్రస్తావించారు. కరెంట్ ఛార్జీలను తగ్గించడం, సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడం, స్వచ్ఛాంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యత ఇవ్వడం, అలాగే 704 ప్రభుత్వ సేవలను వాట్సాప్‌లో అందుబాటులోకి తీసుకురావడం వంటి వాటిని వివరించారు. ఒక కుటుంబం ఒక వ్యవస్థాపకుడిగా మారాలనే విధానాన్ని తీసుకువస్తున్నామని, 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను నెంబర్ వన్ రాష్ట్రంగా మార్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
మహిళా సాధికారత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించారు. కూటమి ప్రభుత్వం రూ. 33 వేల కోట్ల విలువైన పెన్షన్లను ఇంటికే అందిస్తోందని, “అన్నదాత సుఖీభవ”, “తల్లికి వందనం” వంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఆగస్టు 15న అమలులోకి తెచ్చిన “మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం” ఆర్థిక విప్లవానికి నాంది పలికిందని పేర్కొన్నారు. దీని వల్ల మహిళలు ఆర్థిక స్వాతంత్ర్యం పొందుతారని, స్కూళ్లు, దేవాలయాలు, వ్యాపారాల కోసం ఈ సేవను ఉపయోగించుకోవచ్చని తెలిపారు. దీంతో పాటు, పొగ రాని పొయ్యి కోసం “దీపం-2” పథకం కింద మూడు సిలిండర్లు అందిస్తున్నామని చెప్పారు. జనాభా నిర్వహణపైనా ప్రభుత్వం దృష్టి పెట్టిందని, ప్రస్తుతం ఖర్చుల భారం వల్ల చాలామంది పిల్లలను కనడం మానేస్తున్నారని, దీని వల్ల భవిష్యత్తులో దేశం యువత కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తుందని ఆయన వివరించారు.